మనిషి మారిపోయే.. ఆతని లుక్కు అదిరిపోయే!
సినిమా తారలు తమ ఫిట్నెస్ను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమ కడుపు కట్టుకొని మరీ నాజూకుగా కనిపించే ప్రయత్నం చేస్తారు. ఒకప్పుడు హీరోయిన్లు బొద్దుగా ఉండేవారు. ఇప్పుడలా కాదు, హీరోయిన్ అంటే జీరో సైజ్ ఉండాలంటున్నారు. మరి హీరోల పరిస్థితి ఏమిటి? అంటే వాళ్లు కూడా తమ ఫిట్నెస్ కాపాడుకోకపోతే అవకాశాలు తగ్గుతాయి. దానికి నిదర్శనంగా నారా రోహిత్‌ను చెప్పుకోవచ్చు. బాణం చిత్రంతో హీరోగా పరిచయమైన రోహిత్ సోలో, ప్రతినిధి వంటి సినిమాల్లో తన పెర్ఫార్మెన్స్తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జయాపజయాలతో సంబంధం లేకుండా రోహిత్‌కు అవకాశాలు చాలా వచ్చాయి. అయితే ఎంచుకున్న కథలో లోపాలు ఉండడం, ఫిజిక్‌పై కూడా శ్రద్ధ పెట్టకపోవడం తదితర కారణాల వల్ల ఆయా సినిమాలు అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయాయి.
ఈమధ్యకాలంలో రోహిత్‌కు అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో తన ఫిజిక్పైన శ్రద్ధ పెట్టాడు. మంచి స్టైలిష్ లుక్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. తాజాగా రోహిత్ తన లుక్‌ను విడుదల చేశాడు. ఒకప్పటి రోహిత్‌కు.. ఇప్పడు మనం చూస్తున్న రోహిత్‌కు సంబంధమే లేదు అన్నంతగా అతని లుక్ మారిపోయింది. మరి ఈ లుక్‌తో ఎలాంటి సినిమాలు చేస్తాడో చూడాలి మరి.













