వెండితెరపై చంద్రబాబు బయోపిక్
దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. వెంకట రమణ దర్శకత్వం వహిస్తుండగా, జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు. చంద్రబాబుగా వినోద్ నువ్వుల, ఎన్టీఆర్‌గా భాస్కర్ నటిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఒక అరుదైన, ఆదర్శవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు. సామాన్య కుటుంబంలో జన్మించి, అగ్ర స్థానానికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ తెలియాలనే ఈ చిత్రాన్ని తీస్తున్నాం. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. చంద్రబాబు చిన్ననాటి జీవితం నుంచి ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాం అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబరు 1కి 23 యేళ్లు అవుతోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అణువణువుగా ఆయన మార్క్ కనిపిస్తూనే ఉంటుంది. ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అన్నారు. శివానీచౌదరి, మౌనిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్‌కిరణ్.పి.ఆర్.













