రూ.200 కోట్లతో నాని సినిమా
గతేడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుస హిట్లు అందుకున్న నాని ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం చేస్తున్న నాని, ఆ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ సినిమా తర్వాత నాని, సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని మోషన్ పోస్టర్ ను కూడా అనౌన్స్ చేశారు.
కానీ బడ్జెట్ సమస్యల వల్ల ఈ సినిమా హోల్డ్ లో పడింది. అయితే ఇది కాకుండా నాని, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా బడ్జెట్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది.
ఈ సినిమాను శ్రీకాంత్ ఏకంగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు నాని కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా దసరానే. ఇప్పుడు మళ్లీ శ్రీకాంత్ తో నాని చేస్తున్న సినిమానే మరో హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా కావడం విశేషం. ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. నాని కొత్త లుక్ లో కనిపించనున్న ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.













