సున్నితంగా తిరస్కరిస్తున్న నాని, దుల్కర్
సీనియర్ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు. పాత్ర ఎంత చిన్నదైనా, ఎలాంటి పాత్రైనా సరే వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవానుకుంటారు. కానీ నేచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్ ఇందుకు భిన్నంగా ఉన్నారు. కొన్ని నెలల కిందట రజినీకాంత్ హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఓ ముఖ్య పాత్ర ను నాని కి ఆఫర్ చేశారు.
ఆ ఆఫర్ గురించి చాలా ఆలోచించిన తర్వాత నాని ఇది తన వల్ల కాదని, తన కెరీర్ కు ఈ పాత్ర వల్ల ఎలాంటి ఉపయోగముండదనుకుని సున్నితంగా తిరస్కరించాడు. ఫలితంగా ఆ ఛాన్స్ రానా దగ్గుబాటికి చేరింది. ఇక దుల్కర్ సల్మాన్ కూడా నానినే ఫాలో అవుతున్నాడు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న తగ్ లైఫ్ సినిమాకు ఫస్ట్ దుల్కర్ ఓకే చెప్పాడు.
కానీ తాజాగా కాల్షీట్స్ ప్రాబ్లమ్ అంటూ ఆ సినిమా నుంచి దుల్కర్ తప్పుకుంటున్నట్లు తెలిపాడు. దుల్కర్ కు కమల్ సినిమాలో ఆఫర్ అనేది చాలా అరుదైన ఛాన్స్. అయినా సరే తన కమిట్మెంట్స్ ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా నుంచి సైలెంట్ గా పక్కకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తుంటే మిడ్ రేంజ్ హీరోలు తమ కెరీర్ ను ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాని సరిపోదా శనివారం సినిమాలో బిజీగా ఉంటే, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.













