ఈ సమ్మర్ నానీదేనా?
సమ్మర్ వస్తోందంటే చాలు. చాలా సినిమాలను రిలీజ్ కు రెడీ చేస్తుంటారు. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ కాలం సినిమాలు ఆడే సీజన్ సమ్మరే. మార్చి నెలాఖరుతో స్టార్ట్ చేస్తే రెండు నెలల పాటూ సమ్మర్ హాలీడేస్ ఉంటాయి కాబట్టి జనాలు థియేటర్లకు పెద్ద ఎత్తున వస్తారు. ఆ టైం లో సినిమాలు బాగా వసూలు చేస్తాయి. అందుకే పెద్ద సినిమాల్ని సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. ఈ సీజన్లో కనీసం రెండు మూడు పెద్ద సినిమాలైనా టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈసారి మాత్రం టాప్ హీరోల సినిమాలేమీ ఈ సమ్మర్ లో రిలీజ్ కావట్లేదు.
సమ్మర్ కి రిలీజ్ అవుతాయనుకున్న సలార్, భోళాశంకర్, హరిహర వీరమల్లు, మహేష్ త్రివిక్రమ్ సినిమాలు అనుకోని కారణాలతో ఇంకా షూటింగ్ దశలోనే ఉండిపోయాయి. దీంతో ఈ సమ్మర్ మిడ్ రేంజ్ హీరోల సినిమాలతోనే గడిచేలా ఉంది. నాని దసరా, ఏజెంట్, రావణాసుర, శాకుంతలం, రామబాణం, విరూపాక్ష లాంటి సినిమాలన్నీ సమ్మర్ లోనే రిలీజ్ కానున్నాయి. వీటిలో పెద్ద రేంజ్ సినిమా స్థాయికి వెళ్లగలిగే సినిమాగా దసరా మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సినిమాలకు క్రేజ్ ఉన్నప్పటికీ, దసరా బజ్ ముందు ఈ సినిమాలన్నీ చిన్నవిగానే కనిపిస్తున్నాయి.
అప్పటి వరకు ఓ స్థాయిలో ఉన్న దసరా బజ్, టీజర్‌తో ఒక్కసారిగా పెరిగిపోయింది. నాని కెరీర్‌ను దసరా తర్వాతి స్థాయికి తీసుకెళ్లే సినిమా అవుతుందని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దానికి తోడు ఇలాంటి సినిమాలకు ఏ మాత్రం మంచి టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించడం ఖాయం. సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మార్చి 30న దసరా పాన్ ఇండియన్ లెవల్ లో రిలీజ్ అవుతుంది. నాని కూడా ఈ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు. పాజిటివ్ టాక్ వస్తే వేసవి విన్నర్ దసరానే అయ్యే ఛాన్సుంది.













