అమెజాన్ ప్రైమ్ లో ‘V’ సెప్టెంబర్ 5న డిజిటల్ వేదికపై విడుదల
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న ‘V’ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలవుతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిని నిజం చేస్తూ అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటన చేస్తూ నాలుగు పేజీల లెటర్ ప్రెస్ కి విడుదల చేసారు.
కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతబడటంతో సినీ ప్రేమికులకు వినోదం దూరమైపోయింది. ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఉన్నా వాటిని ఇష్టపడేవాళ్లు కొంత మందే. థియేటర్లో మజా కోసం వేచి చూస్తున్నవాళ్లు చాలా మందే ఉన్నారు. అందుకే, చిన్న చిన్న సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నా.. స్టార్ హీరోలు మాత్రం థియేటర్లు తెరుచుకునేవరకు వేచి చూస్తున్నారు. అయితే, ఫస్ట్ టైమ్ ఒక స్టార్ హీరో సినిమా నేరుగా డిజిటల్లో విడుదల కాబోతోంది.
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషించిన ‘V’ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారం ఇప్పుడు నిజం కాబోతోంది.సెప్టెంబర్ 5 న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల కాబోతోంది. ఆ ప్లాట్‌ఫాం ఏంటి అనేది రేపు తెలియబోతోంది. ఈ మేరకు బుధవారం నాని ఒక ప్రకటన చేశారు. ఆసక్తికరమైన వీడియోను వదిలారు.
ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా భయానక పరిస్థితులకు ముందు మార్చిలో విడుదల కావాల్సి ఉంది. లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతబడటంతో విడుదల ఆగిపోయింది. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని ఇన్నాళ్లు వేచి చూశారు. కానీ, సినిమా హాళ్లు తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవడంతో నేరుగా ఓటీటీలో విడుదల చేసేస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. అలాగే, టీజర్ కూడా వచ్చింది.
ఇదిలా ఉంటే, V సినిమా విడుదల కాబోయే ఓటీటీ ప్లాట్‌ఫాం ఏమిటి? ట్రైలర్ ఎప్పుడు? వంటి విషయాలను బహుశా రేపు చిత్ర యూనిట్ వెల్లడించవచ్చు. కానీ, ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసిందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో V ప్రీమియర్ కానుందని సమాచారం.













