నెపొటిజంపై నాని, రానా సంచలన వ్యాఖ్యలు
ఏ పరిశ్రమలో అయినా నెపోటిజం అనేది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. సినీ ఇండస్ట్రీలో అది ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తుంటుంది. రోజూరోజుకీ నెపొటిజం పెరుగుతుందే తప్పించి తగ్గట్లేదు. అయితే నెపోటిజంతో హీరోలైన వారితో పాటూ, సొంతంగా తమ టాలెంట్‌తో పైకి ఎదిగిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రెండు కోవలకు చెందిన హీరోలు సింగర్ స్మిత చేస్తున్న ఇజం షోకు గెస్టులుగా వచ్చారు.
కేవలం గెస్టులుగా రావడమే కాదు వీరిద్దరూ షో లో నెపొటిజంపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. వీటిలో నాని నెపొటిజం గురించి మాట్లాడుతూ, సినీ ఇండస్ట్రీలో నెపొటిజం రాజ్యమేలడానికి కారణం దాన్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులే అని తేల్చి చెప్పాడు. ఉదాహరణగా రామ్ చరణ్ మొదటి సినిమాను కోటి మంది చూస్తే, తన తొలి చిత్రాన్ని లక్షమంది చూశారని, అలాంటప్పుడు నెపొటిజంను ఎంకరేజ్ చేస్తుందెవరు? ఆడియన్సే కదా కుండబద్దలు కొట్టేశాడు నాని.
ఇదే విషయమై రానా మాట్లాడుతూ, తాను తెలుగు చిత్ర పరిశ్రమకే వారసత్వ హీరోనని, మిగిలిన ఇండస్ట్రీలకు కాదని, కానీ అన్ని చోట్లా తను సత్తా చాటుకున్నట్లు తెలిపాడు. తను బాలీవుడ్లో మొదటి సినిమా చేస్తున్నప్పుడు తనెవరో, తన ఊరేంటో కూడా ఎవరికీ తెలియదని, వారసత్వమనేది కేవలం మన పరిచయం వరకే ఉపయోగపడుతుంది కానీ తర్వాత మన టాలెంట్ వల్లే రేంజ్ మారుతుందని రానా చెప్పాడు.
అంతేకాదు తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లకపోతే అది తప్పు మాత్రమే కాదు, కుటుంబానికి కూడా అన్యాయం చేసిన వాడినవుతానని అన్నాడు. అందరూ లెగసీని చూస్తారు, లెగసీ వల్ల వచ్చే బరువు బాధ్యతలు ఎవరికీ తెలియవు, వారి గురించి ఆలోచించరు కూడా. ఏదొక రోజు ప్రాంతీయంగా ఉన్న సినీ పరిశ్రమలన్నీ కలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారతాయని తను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాడే చెప్పినప్పటికీ ఎవ్వరూ దాన్ని నమ్మలేదని, కానీ ఇప్పుడు తను చెప్పిందే జరుగుతుందని రానా పేర్కొన్నాడు.













