మరోసారి జత కట్టనున్న బాలయ్య-నయన్
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి కాంబినేషనే బాలయ్య- నయనతార ది కూడా. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు. టాలీవుడ్లో మరే హీరోకి కూడా సెట్ కానంతగా నయన్, బాలయ్య జోడీ కుదిరింది. అందుకే వారి కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగిపోతుంది.
వీరి కలయికలో గతంలో వచ్చిన సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా లాంటి సినిమాలన్నీ మంచి హిట్లుగా నిలిచినవే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరో సినిమా కోసం జత కడుతున్నారా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడితో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న బాలయ్య ఆ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేశాడు.
దసరాకు రిలీజ్ కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా వేగంగానే జరుపుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ లో డబ్బింగ్ తప్ప తనకేం పెద్దగా పనుండదు కాబట్టి బాలయ్య తన తర్వాతి సినిమాను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని చూస్తున్నాడట. రేసులో ఎంతో మంది ఉన్నప్పటికీ వారందరినీ కాదని బాలయ్య, బాబీకి ఛాన్స్ ఇచ్చాడు.
ఇప్పటికే బాబీ స్టోరీని లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ గా నయన్ అయితే బావుంటుందనుకుని ఆమెను సంప్రదించగా, నయన్ కూడా సానుకూలంగానే స్పందించిందని, త్వరలోనే కాల్షీట్స్ చూసుకుని డేట్స్ కేటాయిస్తానన్నట్లు చెప్పిందని టాక్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయన్ తన కాల్షీట్స్ ను చాలా వరకు అడ్జస్ట్ చేసుకుంటేనే ఈ సినిమాలో నటించగలదు. మరి ఈ కాంబోని మరోసారి తెరపై చూడగలమో లేదో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.













