కరోనాపై పోరాటానికి బాలకృష్ణ విరాళం కోటి 25 లక్షలు
కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హిందూపూర్ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 1 కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. అందులో 50 లక్షలు ఆంధప్రదేశ్ సీఎం సహయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్ ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్ కు అందించారు. కరోనా పై పోరాటానికి తన వంతు బాధ్యతగా 1 కోటి 25 లక్షల విరాళంగా అందిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ తెలిపారు. స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని, కరోనాని అరికట్టడంలో మనందరం భాగస్తులం కావాలని పిలుపునిచ్చారు.













