న్యూ ఏజ్ మూవీగా నందమూరి బాలకృష్ణ నర్తనశాల మళ్ళీ తీస్తారా?
బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో పదహారు ఏళ్ల క్రితం మొదలైన నర్తనశాల కొద్ది రోజుల షూటింగ్ తర్వాత ఆగిపోయింది. ద్రౌపది పాత్ర పోషిస్తోన్న సౌందర్య ఫ్లయిట్ యాక్సిడెంట్లో మరణించడంతో పాటు బాలయ్యకు పర్సనల్‌గా కొన్ని అవాంతరాలు ఏర్పడడంతో ఆ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఆ చిత్రానికి నిర్మాత పూసపాటి లక్ష్మిపతి రాజు మధ్యలో ఆగిపోవడంతో నిర్మాత ఆర్ధికముగా ఎంతో నష్టపోయాడు. ఆ విషయం పక్కన పెడితే, ఇన్నేళ్ల తర్వాత బాలకృష్ణ ఆ చిత్రం కోసం చిత్రీకరించిన ఫుటేజీని విడుదల చేయడానికి ఈ ఏడాది బాలకృష్ణ తన పుట్టినరోజున ప్లాన్ చేసుకున్నారు. టెక్నికల్ పరంగా ఆ రోజు విడుదల చేయడానికి కుదర లేదు. ఈ రోజు విజయదశమి సందర్భంగా శ్రేయాస్ ఈ టి, ఎన్ బి కె థియేటర్ ద్వారా విడుదల చేసారు. పదహారు నిమిషాల నిడివి మాత్రమే వున్న షార్ట్ క్లిప్పింగ్‌లో కేవలం రెండే సన్నివేశాలు మాత్రం వున్నాయి. అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసానికి వెళ్లాల్సిన పాండవుల్లో ఎవరెవరు ఏ వేషాలు వేసుకోవాలి, ఏ విధంగా ఆ ఏడాది ఎవరి కంట పడకుండా వుండాలి అనేది. చర్చించుకోవడమనేదే ఓ సుదీర్ఘ సన్నివేశం. ఇక్కడితో సరిగ్గా ఎనిమిది నిమిషాల నిడివి వచ్చింది. బాలకృష్ణ ఈ చిత్రం కోసం డైరెక్ట్ చేసింది ఇంతవరకు మాత్రమే. పదహారు నిమిషాల నిడివితో విడుదల చేసిన ఈ వీడియో క్లిప్‌లో కనీసం అంతసేపు కూడా బాలయ్య దర్శకత్వ ప్రతిభ కానీ, ఆయన పూర్తి నటనా పటిమను చూసే అవకాశం లేకుండా పోయింది.
ఇక మిగతా ఎనిమిది నిమిషాల సేపు ఏమి చూపించారంటారా? స్వర్గీయ ఎన్టీఆర్ చేసిన క్లాసిక్ నర్తనశాల చిత్రం నుంచి ‘‘నరవరా కురువరా’’ పాటను యథాతథంగా చూపించేసారు. అయితే సినిమా స్కోప్ ఫ్రేమ్ లో చూపించారు. అర్జునుడిని ఊర్వశి శపించే సన్నివేశం కూడా ఆ చిత్రంలోనిదే వాడారు. ఇక కొసమెరుపుగా బాలయ్యను బృహన్నల వేషంలో చూపించడానికి ‘టాప్ హీరో’లో ఒక పాటలో చేసిన చిన్న బిట్ కూడా జత చేసారు. అంత వరకు బాగానే వుంది పౌరాణికం అంటే ఆ వేషధారణే ఉండాలి కానీ…. కానీ పక్కన రెగ్యులర్ హీరో బాలకృష్ణ డాన్స్ చేస్తూ కనిపించడం నర్తనశాల సినిమాకు లోపంగా కనిపిస్తుంది. ఇప్పుడున్న టెక్నాలజీ ని ఉపయోగించుకుని కేవలం బృహన్నల పాత్రనే చూపిస్తే బాగుండేది. ఈ వీడియో క్లిప్ ద్వారా వచ్చిన మొత్తం చారిటీ కోసం వాడాలని తలపెట్టారు ఇది మంచి ఆలోచనే కానీ యాభై రూపాయల వర్త్ నర్తనశాలలో లేనే లేదు. బాలకృష్ణ నోటివెంట ఆ తేట తెలుగు సంభాషణలు వినడానికి, కీర్తి శేషులైన సౌందర్య, శ్రీహరిని మరోసారి వీక్షించడానికి అవకాశం కల్పించిందనే కారణం మినహా ఈ వీడియో ఎవరినైనా నిరాశ పరుస్తుంది. కాకపోతే ఈ చిత్రాన్ని మరో సారి తెరకెక్కించాలంటే మాత్రం నందమూరి బాలకృష్ణే సంకల్పించాలి, న్యూ ఏజ్ మూవీగా నందమూరి బాలకృష్ణ నర్తనశాల మళ్ళీ తీస్తే బాగుంటుంది అయన ఒక్కడికే మాత్రమే ఇది సాధ్యమని జగమెరిగిన సత్యం.













