ముంబై లో మళ్ళీ డ్రగ్స్ కలకలం యంగ్ హీరోయిన్ నైరా నేహాల్ అరెస్ట్
ముంబై అంటేనే డ్రగ్స్‌కి అడ్డాలా మారిపోయింది. ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు.. డ్రగ్స్ వైపుగా మారి బాలీవుడ్లో ఎటువంటి అలజడిని సృష్టించిందో తెలియంది కాదు. తాజాగా బాలీవుడ్ యువ నటి బర్త్‌డే పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్నారని తెలిసి.. ముంబై పోలీసులు అలెర్టయ్యారు. ఈ పార్టీలో నటి నైరా నేహాల్ షాతో పాటు, ఆమె స్నేహితుడు అశిక్ సాజిద్ హుస్సేన్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.. మరోసారి బాలీవుడ్లో డ్రగ్స్ కలకలం మొదలైంది. ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఆదివారం జరిగిన ఈ బర్త్‌డే పార్టీలో నైరా.. తన స్నేహితులతో కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా సమాచారం అందడంతో.. సోదాలు నిర్వహించామని, చరస్‌ను వారు సిగరెట్లో చుట్టి తీసుకున్నట్లుగా గమనించి వారిని అరెస్ట్ చేశామని ముంబై పోలీసులు తెలిపారు.
కోర్టులో హాజరు పరిచేముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. మోతాదుకు మించిన మత్తు పదార్థాలు వారు సేవించినట్లుగా రిపోర్ట్ వచ్చిందని, అసలు వీరికి డ్రగ్స్ ఎలా లభించాయనే దానిపై ఇంటరాగేషన్ చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. కాగా, నైరా, అశిక్లకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. నైరా విషయానికి వస్తే.. ఆమె తెలుగులో ఆది సాయికుమార్ సరసన ‘బుర్రకథ’ అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది.













