మన్మథుడు కు ఇది సీక్వెల్ కాదు : నాగార్జున
నాగార్జున కథానాయకుడిగా వయాకామ్ 18 స్టూడియోస్, అన్నపూర్ణ స్టుడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ ఫిలింస్ నిర్మించిన చిత్రం మన్మథుడు 2. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. రకుల్‌ప్రీత్ సింగ్ నాయిక లక్ష్మి, సమంత, వెన్నెల కిషోర్, రావు రమేష్ ఇతర ప్రధాన పాత్రధారులు. ఆగస్టు 9న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నాగార్జున, వయాకామ్ స్టుడియోస్ ప్రతినిధి అజిత్‌తో కలిసి ఈ సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.
అనంతరం ఏర్పాటైన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ మేం వయాకామ్ 18తో కలిసి చేసిన తొలి చిత్రమిది. తెలుగు నిర్మాతలతో వాళ్లు కలవడం మాకూ కొండంత ధైర్యంగా ఉంది. మన్మథుడు కు ఇది సీక్వెల్ కాదు. రెండూ రొమాంటిక్ కామెడీ జోనర్లే. ఈ రెండింటిలోనూ ఇది ఎక్కు, ఇది తక్కువని చెప్పలేను. ఈ సినిమా చేస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను. సమంతతో మనం, రాజుగారి గది 2 చిత్రాలు చేసినప్పటికన్నా ఈ చిత్రం చేస్తున్నప్పుడే ఎక్కువ సంతోషం అనిపించింది. ఈ చిత్రం దేనికీ కాపీ కాదు. ఓ ఫ్రెంచి చిత్రం హక్కుల్ని కొని మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తీశాం అన్నారు.













