బిగ్‌బాస్ సీజన్ 4కి రంగం సిద్ధమవుతోందా?
లాక్డౌన్ కారణంగా సినిమా పరిశ్రమకే కాదు, టెలివిజన్ రంగానికి కూడా కష్టాలు తప్పడం లేదు. డైలీ సీరియల్స్, రియాలిటీ షోలు.. అన్ని షూటింగ్స్ నిలిచిపోవడంతో.. చేసేది లేక ఇంతకుముందు టెలికాస్ట్ చేసిన ఎపిసోడ్స్‌నే మళ్ళీ ప్రసారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న బిగ్‌బాస్ షో సీజన్ 4ను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ లాక్డౌన్ తర్వాతే ఉంటుంది. అయితే ఈ షోకు ఎవరు హోస్ట్‌గా వ్యవహరిస్తారు? ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అనే విషయాల్లో చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
సీజన్ 4 హోస్ట్.. నాగార్జున
బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఎన్టీఆర్ తొలి సీజన్‌కు, నాని రెండో సీజన్‌కు, నాగార్జున మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. నాలుగో సీజన్‌కు హోస్ట్ మారుతున్నారని వచ్చిన వార్తలను నిర్వాహకులు ఖండించారు. నాలుగో సీజన్ మొదలు పెట్టేట్టయితే దానికి నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. సెబ్రిటీలతో చర్చలు షురూ.. బిగ్‌బాస్ షో కోసం చాలా మందితో కూడిన సెబ్రిటీ జాబితాను సిద్ధం చేశారని, వారిలో కొందరితో చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ జాబితా మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రచారంలో ఉన్న సెబ్రిటీల జాబితా బిగ్‌బాస్ సీజన్ 4కు ప్రధానంగా పరిశీనలలో ఉన్నవారిలో అల్లరి నరేష్, యాంకర్ ఝాన్సీ, సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్, నటుడు నందు, తాగుబోతు రమేష్ పేర్లు టాప్ లిస్టులో ఉన్నట్టు సమాచారం. అలాగే కార్తీక దీపం ఫేమ్ దీప పేరు కూడా లిస్ట్‌లో ఉందట. వీరితోపాటు కొంతమంది యాంకర్లు, కమెడియన్స్, ఓ శృంగార తార, సామాజిక కార్యకర్తల పేర్లు కూడా పరిశీలనలో వున్నాయి. వారిని కూడా ఈ షో కోసం సంప్రదించారని తెలుస్తోంది. పైన పేర్కొన్న జాబితాలోని వారు ఇప్పటికే పలు షోలకు కమిట్ అయి ఉన్నారు. వాటిని మధ్యలో అపేసి వచ్చే పరిస్థితి మాత్రం కనపించడం లేదు. అయితే ఫైనల్‌గా ఈ షోలో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? బయటికి వచ్చిన లిస్ట్ ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.













