మొదలవక ముందే ఆగిపోయిన నాగశౌర్య సినిమా
యంగ్ హీరో నాగశౌర్య కెరీర్ వరుస డిజాస్టర్లతో అనుకున్నంత బాలేదు. అతని నుంచి ఆఖరిగా వచ్చిన రంగబలి సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమా తర్వాత మీడియాతో మాట్లాడుతున్న టైమ్ లో తన తీరు కాస్త వివాదాస్పదమైన విషయం తెలిసిందే. చేసిన సినిమాలన్నీ ఫ్లాపవడంతో తర్వాతి సినిమాకు కాస్త టైమ్ తీసుకున్నాడు నాగశౌర్య.
ఈలోగా మర్డర్ కేసులో ఇరుక్కున్న కన్నడ నటుడు దర్శన్ కు మద్దతిస్తూ నెట్టింట చేసిన పోస్ట్ తో నెగిటివిటీ మూట కట్టుకున్నాడు. అయితే ఇప్పుడు నాగశౌర్య కొత్త సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అరుణాచలం అనే కొత్త డైరెక్టర్ తో నాగశౌర్య తన కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడని, రెండు వారాలు తిరక్కుండానే ఆ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది.
ఈ సినిమాను ఓ ఎన్నారై నిర్మాత నిర్మిస్తుండగా, షూటింగ్ కు ముందే డైరెక్టర్, మిగిలిన టీమ్ అతనితో స్టోరీ డిస్కషన్స్, ప్రీ ప్రొడక్షన్ పేరిట బాగా ఖర్చు పెట్టించారని, దీంతో బడ్జెట్ అప్పుడే రూ.10కోట్లు దాటిపోయిందని, అందుకే నిర్మాత భయపడి సినిమాను ఆపేశాడని టాక్ వినిపిస్తోంది. తను ఖర్చు పెట్టిన డబ్బును తనకు సెటిల్ చేసి వేరే నిర్మాతను చూసుకోమని, ఈ విషయంలో ఫిల్మ్ ఛాంబర్ పెద్దలను సదరు నిర్మాత ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరి ఈ గొడవల మధ్యలో నాగశౌర్య కొత్త సినిమా ఏమవుతుందో చూడాలి.













