జర్నలిస్ట్ పాత్రలో అక్కినేని నాగచైతన్య ఓటీటీ ప్రపంచంలోకి ఎంట్రీ
అక్కినేని నాగచైతన్య ఇటీవల బంగార్రాజు చిత్రంలో కింగ్ నాగార్జునతో కలిసి నటించి హిట్ కొట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు చైతూ. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగా చైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా రాశిఖన్నా నటిస్తుండగా.. అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఇదిలా ఉంటే నాగ చైతన్య ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా నాగ చైతన్య ఓటీటీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఇక, క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సిరీస్లో చైతు జర్నలిస్ట్ గా, నెగెటివ్ పాత్రలో చేస్తున్నట్లు సమాచారం. అందులో చైతు మేకోవర్ కూడా విభిన్నంగా ఉంటుందని టాక్. మొత్తం మూడు సీజన్లుగా ఈ వెబ్ సిరీస్ ను ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో సీజన్ లో 8 నుంచి 10 ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం. అలాగే ఇది టైమ్ ట్రావెల్ స్టోరీ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఒకవేళ చైతూ టైమ్ ట్రావెల్ వంటి కాన్సెప్ట్ ఉన్న వెబ్ సిరీస్ లో జర్నలిస్ట్ గా నెగెటివ్ రోల్ చేస్తే మంచి ఛాలెంజింగ్ పాత్ర దొరికినట్లే. ఈ పాత్రలో చైతూ ఎలా అలరిస్తాడో వేచి చూడాలి.













