Naga Chaithanya: క్యాన్సర్ పిల్లలతో సరదాగా గడిపిన చైతూ జంట
నాగ చైతన్య(Naga Chaithanya) గత డిసెంబర్ లో శోభితా ధూళిపాల(Shobitha Dhulipala)ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ డిసెంబర్ లో ఇరు కుటుంబాల నడుమ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తాజాగా ఈ జంట బయట మెరిశారు. చైతన్య, శోభిత తాజాగా క్యాన్సర్ పేషెంట్స్ ను కలిశారు. హైదరాబాద్‌లోని సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్ ను సందర్శించింది ఈ జంట.
క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్ కు వచ్చే పిల్లలకు, వాళ్ల కుటుంబాలకు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తుంది ఈ చైల్డ్ కేర్ సెంటర్. తాజాగా ఈ సెంటర్‌కు వెళ్లిన చైతూ దంపతులు అక్కడి పిల్లలతో, వారి పేరెంట్స్‌తో ముచ్చటించి, పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. అంతేకాదు వారితో కలిసి నాగ చైతన్య డ్యాన్సులు వేసి వారికి గిఫ్టులు కూడా పంచారు.
క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారులకు ధైర్యం చెప్పిన ఈ జంట అనంతరం వారితో కలిసి ఫోటోలు కూడా దిగారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా, ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు చైతన్య, శోభితల మంచి మనసుని అభినందిస్తున్నారు. రీసెంట్ గా తండేల్(Thandel) తో సూపర్ హిట్ అందుకున్న చైతన్య, తన తర్వాతి సినిమాను కార్తీక్ దండు దర్శకత్వంలో మార్చి నుంచి మొదలుపెట్టనున్నాడు.













