నాగచైతన్య ‘సవ్యసాచి’ ఫస్ట్ లుక్
‘ప్రేమమ్’ తర్వాత నాగచైతన్య, చందు మొండేటి కలిసి మరో చిత్రం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘సవ్యసాచి’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఇవాళ ఫస్ట్ లుక్ కూడా వదిలారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రమిది. ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా కథ, కథనాలుంటాయి. కథానాయకుడి పాత్రకి తగ్గట్టుగా ‘సవ్యసాచి’ పేరును నిర్ణయించాం. దర్శకుడు చందు మొండేటి ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. ‘ప్రేమమ్’ తర్వాత నాగచైతన్య- చందు కలయికలో వస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలున్నాయి. సెప్టెంబరులో చిత్రీకరణ మొదలవుతుంది. త్వరలోనే చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడిస్తాం’’ అన్నారు.













