ధూత రిలీజ్ ఎప్పుడు చైతూ?
ఒకదాని తర్వాత ఒకటి నాగచైతన్య కు ఫ్లాపులు మామూలు షాక్ ఇవ్వట్లేదు. థాంక్యూ సినిమా పోతుందని ఎడిటింగ్ టేబుల్ మీదే తెలిసిపోయిందని ఓపెన్ గా ఒప్పుకున్న చైతూ, కస్టడీ సినిమా విషయంలో మాత్రం సినిమా సక్సెస్ అవుతుందని చాలా బలంగా నమ్మి, ప్రమోషన్లలో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఎన్ని చేసినా ఫలితం మాత్రం మళ్లీ ఫ్లాపే.
అక్కినేని ఫ్యాన్స్ ఏజెంట్ డిజాస్టర్ నుంచి కోలుకోకముందే చైతూ కస్టడీ రూపంలో మరో ఫ్లాపునివ్వడం తట్టుకోలేకపోతున్నారు. ఇక అసలు విషయానికొస్తే చైతూ ఓటీటీ డెబ్యూ ధూత వెబ్ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఎదురుచూపులే మిగులుతున్నాయి తప్పించి సమాధానం మాత్రం దొరకడం లేదు.
వాస్తవానికి దీని షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కొన్ని నెలల కిందట ప్రీ రిలీజ్ ఈవెంట్ లా ఓ వేడుక ఏర్పాటు చేసి అందులో క్యారెక్టర్లను కూడా పరిచయం చేశారు. అమెజాన్ ప్రైమ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సిరీస్ జాప్యం వెనుక వేరు వేరు కారణాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైతూ మార్కెట్ డల్ గా ఉండటంతో ప్రైమ్ వారే ఈ సినిమాను వాయిదా వేస్తున్నారనే టాక్ అక్కడక్కడా వినిపిస్తోంది.
మరోవైపు ధూత ఫైనల్ అవుట్పుట్ పట్ల సంతృప్తికరంగా లేని అమెజాన్ టీమ్ కొన్ని కీలక మార్పులను సరిచేసే పనిలో ఉన్నారని, అందువల్లే ఈ సిరీస్ రిలీజ్ లేటవుతూ వస్తుందని మరికొందరంటున్నారు. గతేడాది దీపావళి నుంచి ధూత సిరీస్ ఇదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అంటూ ఉడికిస్తున్నారే తప్పించి, దాన్ని రిలీజ్ చేసి ధూతకు మోక్షం మాత్రం కల్పించలేకపోతున్నారు.













