చైతూ సినిమాకు అన్నీ భారీ స్థాయిలోనే!
గత కొన్నాళ్లుగా ఫెయిల్యూర్లతో ఇబ్బంది పడుతున్న నాగచైతన్య, తన తర్వాతి సినిమాను చందూ మొండేటితో చేయనున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్లో చైతూ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టనున్నట్లు సమాచారం.
చైతూకు ఈ రేంజ్ బడ్జెట్ అంటే చాలా ఎక్కువ. లవ్ స్టోరీ సినిమాలో చైతూకు జోడీగా నటించిన సాయి పల్లవినే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించబోతుంది. ఓ గుజరాతీ కథను ఆధారంగా చేసుకుని రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన అన్నింటినీ చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. చైతూ కెరీర్లో ఇప్పటివరకు ఏ సినిమాకు జరగని విధంగా ఈ సినిమాకు వర్క్ షాప్స్, స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ జరుగుతున్నాయట.
చైతూ కూడా ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సినిమా కోసం బాడీని పెంచడానికి జిమ్ లో తెగ కసరత్తులు చేస్తున్నాడు. ఇక పోతే ఈ సినిమాకు బాగా పేరున్న టెక్నీషియన్స్ ను ఫైనల్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారట. ఎంతోమంది పరిశీలించాక మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీ శ్రీ ప్రసాద్‌కు ఓటేసినట్లు తెలుస్తోంది. సినిమాటోగ్రఫర్ గా మథీని అనుకుంటున్నారు. ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోతే మరో పేరున్న టెక్నీషియన్ ఈ ప్లేస్ లోకి రానున్నాడు. అన్ని విధాలుగా సినిమాను ది బెస్ట్ గా నిలబెట్టాలనే సంకల్పంతో మేకర్స్ దీన్ని రూపొందించనున్నారు. ఈ మూవీ హిట్ అయితే చైతూ రేంజే మారిపోయేలా సినిమాను తెరకెక్కించనున్నారట.













