ఖాకీ డ్రెస్లో లక్ టెస్ట్ చేసుకుంటున్న చైతూ, నరేష్
టాలీవుడ్ లో యంగ్ హీరోలందరికీ ఈ మధ్య పోలీస్ స్టోరీల మీదకు దృష్టి వెళ్తుంది. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్కి ఛాన్స్ దక్కడంతో పాటూ సోషల్ మెసేజ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా మంచి స్టోరీతో వస్తే వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడంటే రాజశేఖర్, బాలకృష్ణ లాంటి పెద్ద స్టార్లు మాత్రమే ఖాకీ డ్రెస్ లో కనిపించి ఆకట్టుకునే వారు. వారికే ఆ డ్రెస్ సూటయ్యేది కూడా.
కానీ ఇప్పుడలా కాదు. ప్రతి ఒక్కరూ మనం కూడా ట్రై చేద్దామనుకునే అభిప్రాయానికి వచ్చారు. రవితేజ క్రాక్ మంచి హిట్ అయ్యాక ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా రీసెంట్గా ది వారియర్ సినిమా చేశాడు కానీ అది అంచనాలను అందుకోలేక ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. ఇక అసలు విషయానికి వస్తే వచ్చే నెల కేవలం వారం గ్యాప్లోనే అల్లరి నరేష్, నాగ చైతన్య పోలీస్ డ్రెస్లు వేసుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
నాంది కాంబోలో తెరకెక్కిన ఉగ్రం పై భారీ అంచనాలు లేకపోయినప్పటికీ ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి, హిట్ అవుతుందనే నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్. దీని కోసమే నరేష్ ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైమ్ తన జుట్టుని చాలా పొట్టిగా కత్తిరించుకుని రిస్క్ చేశాడు. ట్రైలర్ మాత్రం బాగానే ఆకట్టుకునేలా ఉంది. డైరెక్టర్ విజయ్ కనకమేడల తన టేకింగ్తో ఏదైనా మ్యాజిక్ చేస్తే మాత్రం సినిమా హిట్టవడం ఖాయం.
ఇది కాకుండా నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో చైతూ పోలీస్ కానిస్టేబుల్. అన్యాయం జరిగితే ఎంత దూరమైనా వెళ్లే నిజాయితీ పరుడిగా పవర్ఫుల్ రోల్ చేశాడు. టిపికల్ స్క్రీన్ప్లే తో షాక్ ఇస్తాడని పేరున్న వెంకట్ ప్రభు నుంచి అక్కినేని అభిమానులు చాలానే ఆశిస్తున్నారు. టాలీవుడ్ డెబ్యూ కావడంతో వెంకట్ ప్రభు చాలానే జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉగ్రం, కస్టడీ రెండు సినిమాలూ సీరియస్ బ్యాక్ డ్రాప్ లోనే కొనసాగుతాయి తప్పించి స్టోరీ బాగా గ్రిప్పింగ్ గా ఉంటే తప్పించి సినిమాలు మెప్పించడం కష్టం. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఆడియన్స్ ని మెప్పిస్తారో చూడాలి.













