బాలకృష్ణగారు.. నోరు అదుపులో ఉంచుకోండి : నాగబాబు
అంశం ఏదైనా తన వివాదాస్పద ట్వీట్స్‌తో, వీడియోలతో నాగబాబు తరచూ స్పందించడం మనం చూస్తున్నాం. తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు నాగబాబు. లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్స్ ఆగిపోవడం, థియేటర్స్ మూత పడడం జరిగింది. లాక్డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో షూటింగ్స్, థియేటర్స్ విషయమై చర్చించేందుకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాసయాదవ్‌తో, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. దీనిపై నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ ఇండస్ట్రీలో జరుగుతున్న మీటింగ్స్ తనకు తెలియవని.. హైదరాబాద్‌లో అంతా కూర్చుని భూములు కానీ పంచుకుంటున్నారా అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తననెవ్వరూ పిలవలేదని.. న్యూస్ పేపర్లలో, టీవీ ఛానల్స్‌లో చూసి విషయం తెలుసుకున్నానని అన్నారు. ఈ విషయంలో నిర్మాత సి.కల్యాణ్ వివరణ ఇచ్చారు. ఇండస్ట్రీ కోసం జరుగుతున్న చర్చలను తప్పుగా చూడడం సరికాదన్నారు. భూములను పంచుకోవడం అనే మాట తప్పు అని వ్యాఖ్యానించారు. తాజాగా నాగబాబు కూడా బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించారు. బాలకృష్ణగారు నోరు జారొద్దు.. నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలంటూ కౌంటర్ వేసారు. సమావేశానికి ఎవర్ని పిలవాలో.. ఎవర్ని పిలవకూడదో కమిటీకి తెలుసు అని ఆవేశంగా మాట్లాడారు. భూములు పంచుకుంటున్నారన్న వ్యాఖ్యలు బాధాకరం అన్నారు నాగబాబు. ఈ వ్యాఖ్యలను వెంటనే బాలయ్య వెనక్కి తీసుకోవాలని కోరారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం సరికాదని అన్నారు. పరిశ్రమనే కాదు.. తెలంగాణ ప్రభుత్వాన్నీ అవమానించారంటూ ఫైర్ అయ్యారు నాగబాబు. ప్రభుత్వం, పరిశ్రమకు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసారు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారో.. ఒకసారి ఏపీకి వెళ్తే తెలుస్తుంది.. వ్యాపారం చేసి ఏపీని ఎవరు సర్వనాశనం చేశారనేది అందరికీ తెలుసు అన్నారు నాగబాబు. బాలకృష్ణ ఏం మాట్లాడినా నోరు మూసుకుని కూర్చోమని.. ఇండస్ట్రీకి ఆయనేం కింగ్ కాదు.. కేవలం హీరో మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు నాగబాబు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో, ఈ విషయంపై ఇంకా ఎవరెవరు తెరపైకి వస్తారో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.













