గాడ్సే ను పొగుడుతూ నాగబాబు ట్వీట్..సోషల్ హీట్
మెగా ఫ్యామిలీ లో నాగేంద్రబాబు తన కంటూ ఒక ప్రత్యేకత ను ఎప్పుడూ చాటుకుంటూ ఉంటారు. రాజకీయంగా గానీ సినిమా రంగంలో గానీ ఆయన తన రూట్ సెపరేట్ అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. ఈ ధోరణి వల్ల ఆయనకు కుటుంబ పరంగా కన్నా వ్యక్తిగతంగా పలు మార్లు వివాదాల్లో నిలిచారు. ఇప్పుడు మళ్లీ ఆయన అలాంటి మరో వివాదంలో ఇరుక్కున్నారు. మన జాతిపిత మహాత్మాగాంధీ ని హత్య చేసిన గాడ్సే ని పొగుడుతూ ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. దీనితో సోషల్ మీడియాలో సంచలనం రేగింది.
గాడ్సే చాలా గొప్పవాడని తన ట్వీట్ లో నాగబాబు కితాబిచ్చారు. అతని జీవిత చరిత్ర తనను ప్రభావితం చేసిందన్నారు. గాడ్సే ఎటువంటి మచ్చ నేర చరిత్ర లేని వ్యక్తి అని కొనియాడారు. గాంధీ ని హత్య చేయడం ఒకటే అతను చేసిన తప్పు అంటూ అభిప్రాయపడ్డారు. గాంధీజీ హత్య తప్పు అంటూనే ఎటువంటి నేర ప్రవృత్తి లేని వ్యక్తి ఆ హత్య చేసాడని అంటే అందుకు దారి తీసిన పరిస్థితులు కూడా ఆలోచించాలన్నారు. గాడ్సే కూడా స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన్నవాడే నన్నారు.
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ ట్వీట్ సోషల్ సెగలు పుట్టించింది. కరోనా హడావుడి లో ఇంకా రాజకీయంగా రాజుకోనప్పటికీ సోషల్ మీడియాలో నడుస్తున్న వాద ప్రతివాదాలు చూస్తూ ఉంటే ఈ వివాదం ఇంకొంచెం బిగుసుకోవచ్చు అనిపిస్తోంది. మెగా ఫ్యామిలీ అంటే ఒంటికాలిపై లేచే కత్తి మహేష్ లాంటి వాళ్ళు అప్పుడే విమర్శలు మొదలుపెట్టారు.
మరోవైపు రాజకీయాల జోలికి ఇక వెల్లనంటూ ఇటీవలే ప్రకటించిన నాగబాబు ప్రచారం కోసం ఇంత వివాదాస్పద కామెంట్ చేసి ఉంటారంటే నమ్మలేం అని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా ఈ వివాదం కూడా కరోనా గోలలో కొట్టుకుపోతుందో…మరి కొందరికి చుట్టుకుపోతుందో… చూడాలి.













