ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా ఇలా ఉండబోతోందట!
సాహోతో అందర్నీ నిరాశపరిచిన ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఓ విభిన్నమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ఓ డియర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే మహానటి దర్శకుడు నాగ్అశ్విన్తో మరో సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను తమ బేనర్లోనే నిర్మిస్తున్నట్లు వైజయంతి మూవీస్ అధినేత సి.అశ్వినీదత్ ప్రకటించిన విషయం తెలిసిందే. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి చిత్రం దర్శకుడు నాగ్ అశ్విన్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రభాస్‌తో నాగ్ చేయనున్న సినిమా పాన్ ఇండియా మూవీగా దేశంలోని పలు భాషల్లో రూపొందనుంది. దీంతో ఈ సినిమాలో నటించే నటీనటులు కీలకంగా మారారు.
ఈ చిత్రంలోని కొన్ని కీలక పాత్రల కోసం బాలీవుడ్‌లోని స్టార్స్‌ను సంప్రదించనున్నాడు నాగ్. ఈ ఏడాది అక్టోబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే దానిపై ఇది ఓ సోషియో ఫాంటసీ మూవీ అని గతంలో క్లారిటీ ఇచ్చాడు నాగ్. ఓ సామాన్య మానవుడు, దేవకన్యలకు పుట్టిన ఓ పిల్లాడి కథతో ఈ సినిమా రూపొందనుందనే వార్త సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి సోషియో ఫాంటసీ చిత్రానికి సహజంగానే విఎఫ్ఎక్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకే విఎఫ్ఎక్స్ కోసం 50 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించారట నిర్మాత అశ్వినీదత్. ఇప్పటివరకు అందిన సమాచారం ఇదే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరు? మిగతా ప్రధాన పాత్రల్లో ఎవరెవరు నటిస్తారనేది ఇంకా ఫైనల్ చెయ్యలేదని సోషల్ మీడియా ద్వారా దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు.













