Karthik Aryan: కరణ్ తో కార్తీక్ కొత్త ప్రయోగం
కరణ్ జోహార్(Karan Johar), కార్తీక్ ఆర్యన్(Karthik Aaryan) కలిసి నాగ్జిల్లా(Naaghzilla) అనే ఓ సినిమా కోసం వర్క్ చేయబోతున్నారు. ఆ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను కరణ్ జోహార్ తన ఇన్స్టాలో షేర్ చేశాడు. అయితే ఇందులో కార్తీక్ ఆర్యన్ 631 ఏళ్ల సర్పంగా కనిపించనున్నాడని అర్థమవుతుంది. కార్తీక్ ఇప్పటివరకు ఎప్పుడూ తన కెరీర్ లో ఇలాంటి ప్రయత్నం చేసింది లేదు.
మోషన్ పోస్టర్ లో కార్తీక్ బ్లూ జీన్స్ లో వీపును చూపిస్తూ ఓ పాముల గుహలో నిల్చుని, దూరంగా ఉన్న నగరం వైపు చూస్తూ కనిపించాడు. అయితే ఇందులో కార్తీక్ చర్మం క్రమంగా ఆకుపచ్చగా ఆ తర్వాత పొలుసులుగా పాము ఆకృతిలోకి మారడం చాలా ఆసక్తికరంగా అనిపించింది. మోషన్ పోస్టర్ ను బట్టి ఈ మూవీలో కార్తీక్ రూపం పాములా మారుతూ ఉంటుందనే స్పష్టత వచ్చేసింది.
నెక్ట్స్ ఇయర్ ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ పై కొంతమంది బాలేదని పెదవి విరుస్తుండగా మరికొందరు మాత్రం ఇందులోని పోస్టర్ కార్తీక్ ఇన్స్టాలో నుంచి తీసుకున్నట్టు ఉందని, కరణ్ జోహార్, అతని టీమ్ కష్టపడి పని చేయడం మానేసిందని విమర్శిస్తున్నారు. మరికొంత మంది మాత్రం కార్తీక్ ఆర్యన్ సూపర్ స్టార్ కావాలంటే ఇలాంటి సగం ఉడికిన కథలను కాకుండా మంచి కథలతో ఆడియన్స్ ను అలరించాలని అంటున్నారు.






