అనిరుధ్‌ని ఒప్పించారంటే మాటలా!
జైలర్ మూవీతో సౌత్ ఇండియా మొత్తం మార్మోగిన పేరు అనిరుధ్ రవిచందర్. యావరేజ్ గా ఉన్న సినిమాను కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో, సాంగ్స్ తో ఎలివేట్ చేసిన సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన అనిరుధ్ మీద ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొన్ని రోజుల్లోనే జవాన్ తో మరోసారి అనిరుధ్ తన టాలెంట్ ను బయటపెట్టనున్నాడు.
జవాన్ తో ఈ సారి తన మ్యూజిక్ తో దేశం మొత్తాన్ని షేక్ చేస్తాడని అందరూ అంటున్నారు. జైలర్ లాంటి సినిమాను తన వర్క్ తో ఎలివేట్ చేసిన విధానాన్ని చూసి, అనిరుధ్ ని తమ సినిమాల్లో భాగం చేసుకోవడానికి దర్శకనిర్మాతలు తెగ క్యూ కడుతున్నారు. భారీ రెమ్యూనరేషన్లు కూడా ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనిరుధ్ కొత్త ప్రాజెక్ట్ లను అంత ఈజీగా ఒప్పుకోవట్లేదు.
ఇంత బిజీగా ఉన్న అనిరుధ్ ను, చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రానున్న సినిమా కోసం ఒప్పించారని వార్తలొస్తున్నాయి. జాలర్ల నేపథ్యంలో సాగే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. భారీ ఆఫర్లకు సైతం నో చెప్తున్న అనిరుధ్ తో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారంటే అదే ఈ సినిమాకు సగం సక్సెస్ అని చెప్పొచ్చు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడంటే సినిమాకు మొదటి నుంచే క్రేజ్ కూడా బాగా ఉంటుంది. ఈ సినిమా నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుందంటున్నారు.













