సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న అనిరుద్
ప్రస్తుతం సినీ పరిశ్రమలో సంగీత దర్శకులు కరువయ్యారనే చెప్పాలి. తిప్పి తిప్పి కొట్టినా మనకు ఉన్నది నలుగురే మ్యూజిక్ డైరెక్టర్స్. వీరిలో ఈ మధ్య మ్యూజిక్ అంటే వినపడుతున్న పేరు మాత్రం ‘ అనిరుద్ రవిచందర్’. ఇతను గతేడాది కమల్ హాసన్ తో విక్రమ్ మూవీకి, ఈ సంవత్సరం రజినీకాంత్ జైలర్ మూవీకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించి సినిమా రిలీజ్ టైమ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు.
దీంతో ప్రేక్షకులు అనిరుద్ని చాలా పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో మూవీస్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ఉండాలని అందరి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ యువతరం మ్యూజిక్ డైరెక్టర్ ని రెమ్యూనరేషన్ విషయంలో చిన్న నిర్మాతలు అందుకోలేరనే టాక్ బాగా వినిపిస్తోంది. ఏ ఆర్ రెహమాన్ వంటి వాళ్ళే రూ. 8 కోట్లు పారితోషికం తీసుకోగా, అనిరుద్ ఏకంగా 10 కోట్లు తీసుకొంటున్నాడని చెన్నై ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అలానే అవుట్ ఫుట్ కూడా ఏమాత్రం తగ్గదని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే రెమ్యూనరేషన్ ఎంతైనా సరే ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నా అనిరుద్కి మాత్రం చేతిలో డేట్స్ లేవట. తాను ట్యూన్స్ ఎప్పుడు ఇచ్చినా సరే అంటేనే ప్రాజెక్ట్స్ ఒప్పుకొంటున్నాడట. ఒత్తిడి చేసే ప్రాజెక్ట్స్ ని నిస్సందేహంగా రిజెక్ట్ చేస్తున్నాడు అని సమాచారం. ముఖ్యంగా వేరే భాషల నుంచి వచ్చినవారైతే నిర్మొహమాటంగా చెప్తున్నారట. అంటే తన తొలి ప్రాధాన్యత తమిళ్ సినిమానే అని చెప్పకనే చెప్తున్నాడు ‘అనిరుద్’.
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ‘ దేవర’ , విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి మూవీస్ కి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఖరారయ్యాడు. దీంతో ఈ ఇద్దరి హీరోల అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఇక జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు అనిరుద్. ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఇంతకుముందు తెలుగులో అజ్ఞాతవాసి ,గ్యాంగ్ లీడర్ , జెర్సీ లాంటి సినిమాలకి మ్యూజిక్ అందించాడు. ఆడియో కంపెనీలు కూడా అనిరుద్ అంటే చాలు ఆఫర్స్ ఇచ్చి మరీ హక్కులను సొంతం చేసుకొంటున్నాయి. అందుకే అనిరుద్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నాడనే చెప్పాలి.













