సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో ఇరుకున పడ్డ కంగనా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తు విషయంలో బాలీవుడ్ నటి కంగన రనౌత్‌ను ప్రశ్నించే వ్యవహారంలో జరిగిన హైడ్రామాకు తెరపడింది. ఎట్టకేలకు కంగనాకు ముంబై పోలీసులు నోటీసులు పంపించారు. ఈ కేసు దర్యాప్తులో విచారణకు హాజరై స్టేట్మెంట్ రికార్డుకు సహకరించాలని కోరారు. ఈ మేరకు మనాలిలోని సొంత ఇంటిలో ఉన్న కంగనకు నోటీసులు పోస్టు చేశారు. ఈ విషయంలో గత రెండు రోజులుగా జరిగిన గందరగోళం ఏమిటంటే.. లాక్డౌన్ సమయంలో కంగనా రనౌత్ ముంబై నుంచి తన మకాంను హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలికి మార్చారు. తన సొంత నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి సుశాంత్ సింగ్ సుసైడ్ గురించి తన అనుమానాలను వీడియో, ట్వీట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ ప్రముఖులపై ఆమె చేస్తున్న ఆరోపణలు మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు కంగనా రనౌత్‌కు నోటీసులు జారీ చేసేందుకు జూలై 23 తేదీన ముంబైలోని నటి ఇంటికి వెళ్లారు.అయితే సిబ్బందిలో ఒకరైన అమృత దత్ పోలీసుల నోటీసులు స్వీకరించడానికి నిరాకరించారు. కంగనా ఊర్లో లేరని తాను నోటీసులు తీసుకోలేనని స్పష్టం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఒకవేళ నోటీసులు స్వీకరించకపోతే బాంద్రా పోలీస్ స్టేషన్‌కి రావాలని కోరితే వారి ఆదేశాలను ఆమె తిరస్కరించారు. ఇక సుశాంత్ కేసులో విచారణకు హాజరుకావాలని కంగనా రనౌత్ సోదరి, ఆమె మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రంగోలి చండేల్తో ఫోనులో సంప్రదింపులు చేపట్టారు. అయితే అధికారికంగా నోటీసులు పంపితే తప్పా మేము విచారణకు హాజరుకాలేమని రంగోలి స్పష్టం చేశారు. దాంతో ఈ వ్యవహారం గందరగోళంగా మారింది. కంగనాకు నోటీసులు ఇచ్చామని.. లేదు మాకు నోటీసులు ఇవ్వలేదని కంగన టీమ్ విరుద్ధంగా ట్వీట్లు చేశారు.













