Trimukha Teaser: అంచనాలు పెంచేసిన సన్నీ లియోన్ ‘త్రిముఖ’ టీజర్

అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాతగా సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో రానున్న చిత్రం ‘త్రిముఖ’ (Trimukha). ఈ మూవీకి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించారు. ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రానున్న ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ గురించి అందరికీ తెలిసేలా టీజర్‌ను అక్టోబర్ 18న రిలీజ్ చేశారు.
‘ఓటమి ఎరుగని శివంగి.. కానీ ఎదురుగా యుద్దం.. తాను ఎప్పుడైనా సిద్దం.. ఇప్పుడు ఎదురైంది ఛేదించలేని పద్మవ్యూహం.. తన చుట్టూ అలుముకుంది సందిగ్ధం.. కనుసైగతో సమస్యను గ్రహించే విషయపరిజ్ఞాని.. సమస్తమూ చదివిన జ్ఞాని.. అహంకారాన్ని అదుపు చేసుకోలేని అజ్ఞాని’ అంటూ వదిలిన ఈ టీజర్ ట్రైలర్ అదిరిపోయింది. ఇందులో సన్నీ లియోన్‌ని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించబోతోన్నారని అర్థం అవుతోంది. క్రైమ్, థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ త్రిముఖ టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ‘త్రిముఖ’ టీజర్‌లోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, బీజీఎం ఇలా అన్నీ కూడా హైలెట్‌గా నిలవనున్నాయి.
చిత్ర నిర్మాత డాక్టర్ శ్రీదేవి మద్దాలి మాట్లాడుతూ .. ‘‘త్రిముఖ’ టీజర్‌ను ఐదు భాషల్లో విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇలా ఐదు భాషల్లో రిలీజ్ చేయడం మా కథపై, సినిమాపై మాకున్న నమ్మకానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా మేము ఒక అద్భుతమైన అనుభవాన్ని రూపొందిస్తున్నాము. ఇది ప్రారంభం మాత్రమే. డిసెంబర్‌లో మా సినిమాను విడుదల చేయబోతోన్నామ’ని అన్నారు.
దర్శకుడు రాజేష్ నాయుడు మాట్లాడుతూ .. ‘‘త్రిముఖ’తో మేము భారతీయ సినిమా సరిహద్దులను దాటబోతోన్నాం. మేము ఇన్నేళ్లు శ్రమించి సృష్టించిన ప్రపంచం గురించి ఈ టీజర్ ద్వారా అందరికీ పరిచయం చేయాలని అనుకున్నాం. ఐదు భాషల్లో విడుదల చేయడం వల్ల సినిమా భావోద్వేగం, స్థాయి అందరికీ తెలుస్తుందని ఆశిస్తున్నాం. ప్రేక్షకులు థియేటర్లలో ఓ విజువల్ వండర్, మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందుతారు’ అని అన్నారు.
‘త్రిముఖ’ సినిమాలో సన్నీ లియోన్‌తో పాటుగా యోగేష్ కల్లె, అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, మొట్టా రాజేంద్రన్, ఆశు రెడ్డి, ప్రవీణ్, షకలక శంకర్, సుమన్, రవి ప్రకాష్, జీవా, సమ్మెట గాంధీ, జెమినీ సురేశ్ తదితరులు నటించారు. ఈ మూవీకి స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కృష్ణ మాస్టర్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా బాబీ మాస్టర్ పని చేశారు. ఈ సినిమాకి ఎడిటర్‌గా ఆర్కే, అఖిల బలరామ్ పని చేశారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి అల్తి వ్యవహరించారు.