మృణాళ్ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్
అవకాశాలందరికీ వస్తాయి కానీ వాటిని ఎంతమంది సరిగా సద్వినియోగం చేసుకున్నారన్నదే పాయింట్. ఏ ఇండస్ట్రీలో అయినా దాని మీదే విజయం ఆధారపడి ఉంటుంది. ఒక పనిని మనం సిన్సియర్ గా చేస్తున్నామంటే దానికి ప్రతిఫలం కొంచెం లేటయినా సరే కచ్ఛితంగా వచ్చి తీరుతుంది. దీన్ని తు.ఛ తప్పకుండా పాటిస్తుంది మృణాళ్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టిన మృణాళ్, సినిమాపై తనకున్న డెడికేషన్‌తో అందరినీ వావ్ అనిపిస్తుంది. ప్రస్తుతం అమ్మడు చేతిలో హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో చేస్తున్న రెండు క్రేజీ ఫిల్మ్స్ ఉన్నాయి. ఈ రెండూ సినిమాల్లో కూడా మృణాళ్ ది చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలుగా తెలుస్తోంది.
ఇప్పటికే హాయ్ నాన్న షూటింగ్ చివరి దశకు చేరుకుంది. విజయ్ తో చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తనకు ఇంతటి క్రేజ్ ఇచ్చిన టాలీవుడ్ ఆడియన్స్ కు మరింత చేరువవ్వాలని నిర్ణయించుకున్న మృణాళ్ దాని కోసం తెలుగు నేర్చుకునే పనిలో పడింది. తెలుగు నేర్చుకుని, అర్థం తెలుసుకుని మాట్లాడాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది మృణాళ్.
అంతేకాదు, తన పాత్రకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకోవాలనుకుంటుందట. సినిమా కోసం మృణాళ్ పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ను చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. డిసెంబర్ లో హాయ్ నాన్న సినిమాతో, జనవరికి విజయ్ దేవరకొండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న మృణాళ్ కు ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి మరి.













