సీత డిమాండ్ బాగానే ఉందే!
ఎవరైనా సరే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్తారు కానీ అందాల భామ మృణాల్ ఠాకూర్ మాత్రం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది. అక్కడి హీరోయిన్లు వచ్చి ఇక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ కు వెళ్తారు. కానీ హిందీలో సినిమాలు చేస్తూ అక్కడ ఓ మోస్తరు ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ టాలీవుడ్ కు వచ్చి ఇక్కడ సత్తా చాటడమంటే ఒక్క మృణాల్ కే చెల్లింది.
సీతారామం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఆ సినిమాతో మంచి హిట్ అందుకుంది. హిట్ తో పాటూ సీతగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. సీతారామం తర్వాత నానితో చేసిన హాయ్ నాన్న కూడా మంచి హిట్ అవడంతో అమ్మడి క్రేజ్ ఇంకా పెరిగింది. కానీ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ మృణాల్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది.
రీసెంట్ గా కల్కిలో ఓ చిన్న పాత్రలో మెరిసిన మృణాల్ ఆ సినిమాలో కనిపించింది కాసేపే అయినా ఆడియన్స్ ను మెప్పించింది. అయితే ఫ్యామిలీ స్టార్ తర్వాత మృణాల్ దూకుడు తగ్గింది. ప్రస్తుతం మృణాల్ దగ్గర రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. దానికి తోడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు మృణాల్ రెమ్యూనరేషన్ పరంగా కూడా భారీగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్-హను కాంబోలో వచ్చే సినిమాలో కూడా మృణాల్ ను అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే అమ్మడి క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో మోత మోగిపోవడం ఖాయం.













