దాన్ని ఏ వెబ్సైట్ చెడగొట్టుకోదు
సినిమా అనేది గ్లామర్ ప్రపంచం. సినిమా హీరోలైనా, హీరోయిన్లు అయినా వాళ్ళు కూడా మనలాగే సామాన్య మనుషులే. కాకపోతే సినిమా అంటే ఇష్టపడని వ్యక్తి ఉండరు, సినిమా తారను ఇష్టపడని వారు ఉండరు. కాబట్టే వాళ్లు సెలబ్రిటీలు అవుతారు. అయితే ప్రేక్షకుల ఆదరణతోనే వాళ్ళు సెబ్రిటీలుగా మారతారు. వారు ఆ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడతారు, మరెన్నో అవమానాలను ఎదుర్కొంటారు. అయితే ఎవరి సహాయం లేకుండా, ఎవరి ప్రోత్సాహం లేకుండా ఉన్నత స్థాయికి రావడం అనేది ఈ రంగంలో కుదరదు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి సపోర్ట్ ఎలాగూ ఉంటుంది. వాళ్ళు ఉన్నత స్థానానికి చేరుకోవడంలో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ, ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, శర్వానంద్ వంటి వారికి కెరీర్ ప్రారంభంలో మాట సాయం చేసిన జర్నలిస్టులు, వారిని ప్రమోట్ చేసిన జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారు.
అయితే ఒక స్థాయికి వచ్చిన తర్వాత గతాన్ని మర్చిపోతుంటారు కొందరు. తమకు సహాయం చేసిన వారిని గుర్తించరు. తమకు తాముగా ఈ స్థాయికి వచ్చినట్టు ఫీల్ అవుతుంటారు. ఓ మహోన్నత జర్నలిస్ట్ చెప్పింది ఏమిటంటే.. మీడియా అనేది ప్రతిపక్ష పాత్రను పోషించాలి. భజన చేయడం మన పనికాదు. తప్పుని ఎత్తి చూపడం మన బాధ్యత అని ఖరాఖండీగా చెప్పారు. సినిమా సెబ్రిటీలను, రాజకీయ నాయకులను కోట్లాది ప్రజలు ఆరాధిస్తుంటారు. అలాంటి సమయంలో ఆయా హీరోల వ్యక్తిగత జీవితాల్లోని మంచి చెడులు, వృత్తిపరంగా వారు చేస్తోన్న తప్పులు ఎత్తి చూపడంలో మీడియా ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ఒక హీరో చేసిన సినిమా బాగా లేదని చెప్పడంలో మీడియా కొంత కఠినంగానే వ్యహరిస్తుంది. ఇటీవలికాంలో వెబ్‌సైట్స్ ఇస్తున్న రివ్యూలపైన హీరోలు అసంతృప్తిగా ఉన్నారు. ఒక సినిమా తియ్యడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాం. దాన్ని చూసి బాగాలేదని రాసేస్తే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. బాగున్న సినిమాని బాగా లేదని, బాగా లేని సినిమాను బాగుందని చెప్పినంత మాత్రాన ఆ సినిమా ఫలితం మారిపోదు. ఏ సినిమా చూడాలి, ఏ సినిమా చూడకూడదు అనే విజ్ఞత ప్రేక్షకుల్లో మెండుగానే ఉంటుంది. ఎందుకంటే జనం పిచ్చివారు కాదు. అలాగని జర్నలిస్టుల్లో కూడా చెడ్డవారు లేరని కాదు. ప్రతి రంగంలోనూ మంచివారు, చెడ్డవారు ఉంటారు. అయితే ఎవరో ఒక్కరు చేసిన తప్పుకు అందర్నీ నిందించడం ఎంతవరకు సమంజసం? ఒకప్పటి నటీనటుల్లో ఉన్న డెడికేషన్, సామాజిక బాధ్యత అనేవి ఇప్పుడు ఉన్నాయా? నాటి పుచ్చలపల్లి సుందరయ్య వంటి నిస్వార్దమైన రాజకీయ నాయకులు ప్రస్తుతం ఉన్నారా? వ్యాపార రంగంలో కూడా తమ లాభాల కోసం పక్కదారి తొక్కి ప్రజల ఆరోగ్యాలతో చెగాటమాడే వారు లేరా? శ్రీశ్రీ అన్నట్లు మీరు సామాన్యమైన వ్యక్తులైతేనే మీకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. కానీ, సెబ్రిటీగా మారి వందల మందిని ప్రభావితం చేసే వారైతే వారికి ఇక వ్యక్తిగత జీవితం అనేది ఉండదు. ఎవరైనా ఇలాంటి వారు తప్పు చేస్తే చాకి రేవు పెట్టి వాయించాలని చెప్పారు. సినిమా విషయానికి వస్తే ఒక వెబ్సైట్ ఇచ్చిన రివ్యూ చూసి ఆ సినిమాకి వెళ్ళాలా? వద్దా? అనేది డిసైడ్ చేసుకుంటున్నారంటే ఆ వెబ్సైట్ మీద వారికి ఉన్న నమ్మకం అది. సినిమా గురించి ఆ వెబ్సైట్లో కరెక్ట్ జడ్జిమెంట్ ఉంటుందని వారు భావిస్తారు. దీన్ని ఎవరూ చెడగొట్టుకోరు. వాళ్ళ పని వాళ్ళు సక్రమంగానే చేస్తున్నారని భావించాలి. అంతే తప్ప వెబ్‌సైట్స్ అనేవి సినిమా వాళ్ళ మీదే ఆధారపడి ఉన్నాయని, వారి దయతోనే నడుస్తున్నాయని, వాళ్ళు ఇచ్చే యాడ్స్‌పైనే వెబ్సైట్ వాళ్ళు బ్రతుకుతున్నారనే వాదన సరికాదు. సోషల్ మీడియా అనేది లేని సమయంలో భజన చేసే సినీ వార పత్రికల విషయంలో అది నిజమే. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు. ఏ వెబ్ సైట్ అయినా తమ వ్యూస్ పెంచుకోవడం కోసం, జనాల్లో తమకంటూ ఓ నమ్మకాన్ని కలిగించుకోవడం కోసం పనిచేస్తుంది. గూగుల్ వంటి వారు ఇచ్చే యాడ్స్ ద్వారా వెబ్‌సైట్స్ రన్ అవుతున్నాయి తప్ప సినిమా వారి యాడ్స్‌కి ఆశ పడి ఎవ్వరూ వీటిని నడపడం లేదు.













