Life: మోనాలిసా కథానాయికగా ‘లైఫ్’ చిత్రం ఘనంగా ప్రారంభం
కుంభమేళాలో పూసలమ్ముతూ విశాలమైన కనులతో సోషల్ మీడియా ద్వారా అందరినీ ఆకట్టుకున్న మోనాలిసా తెలుగులో కథానాయికగా మారింది. సాయిచరణ్ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్ బేనర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి లైఫ్ (Life) అని టైటిల్ ఫిక్స్ చేశారు. నిర్మాత అంజన్న నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. లైఫ్ సినిమా బుధవారం నాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభమైంది.
సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పూజతో లైఫ్ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సురేష్ క్లాప్ కొట్టగా, నిర్మాత డీఎస్ రావ్ కెమెరా స్విచ్చాన్ చేయగా శివన్నారాయణ గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిర్మాత అంజన్న మాట్లాడుతూ.. ఈరోజు సినిమాను ప్రారంభించాం. అలాగే రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతుంది. సరికొత్త ప్రయోగంగా లైఫ్ సినిమాను ఆరంభించాం. కుంభమేళాలో చిన్న వ్యాపారం చేసి ఇండియా మొత్తం ప్రజాదరణ పొందిన అమ్మాయితో సినిమా చేస్తే క్రేజ్ వస్తుందని అనుకున్నాను. అనుకున్నట్లుగా దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో మోనాలిసా ను హీరోయిన్ గా ఎంపిక చేశాం. ఈ చిత్ర కథ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితాల్లో చోటుచేసుకుంటున్న ఘటన ఆధారంగా వుంటుంది. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రముఖులందరికీ పేరు పేరునా దన్యవాదాలు తెలియజేస్తున్నాను.
గీత రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. వెంగమాంబ క్రియేషనర్స్ పై రూపొందుతోన్న లైఫ్ చిత్రంలో మోనాలిసా, సాయి చరణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. గేయ రచయితగా చంటిగాడులో నాకు అవకాశం వచ్చేలా దర్శకురాలికి నన్ను పరిచయం చేసి, అనంతరం కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన శ్రీను కోటపాటి మరలా కమ్ బ్యాక్ గా దర్శకుడిగా రావడం ఆనందంగా వుంది. కథ ప్రకారం సన్నివేశాలకు తగినట్లుగా సాహిత్యం రాసే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు కీబోర్డ్ ప్లేయర్ దినేష్ రీరికార్డింగ్ చేయడం చాలా ఆనందంగా వుంది. మంచి బాణీలు తను సమకూరుస్తున్నాడు. మాటల రచయితతోపాటు ఇందులో పనిచేసిన టెక్నీషియన్లంతా సీనియర్లు పనిచేస్తున్నారు. అంజన్న నిర్మాణంలో సాగుతున్న ఈ చిత్రం యూత్ ఫుల్ సినిమా. హీరో హీరోయిన్లకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాను.
హీరో సాయి చరణ్ మాట్లాడుతూ.. దర్శకుడుని నేను కలిసిన రోజునే కథకు సరిపోతావని చెప్పారు. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే కథాంశంతో లైఫ్ చిత్రం రూపొందుతోంది. ఇందులో చక్కటి సందేశం కూడా ఇమిడి వుంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.
సీనియర్ నటుడు సురేష్ మాట్లాడుతూ.. నిర్మాత అంజన్న గారు దొంగాట సినిమా డిస్ట్రిబ్యూటర్ గా నాకు పరిచయం. ఓరోజు నాకు ఫోన్ చేసి సినిమా చేస్తున్నాను. మీరు ఓ పాత్ర వేయాలన్నారు. వెంటనే ఓకే చెప్పాను. అలాగే దర్శకుడు శ్రీను కూడా నేను నటించిన కొన్ని సినిమాలకు డైరెక్టన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశారు. ఇందులో సపోర్టింగ్ కేరెక్టర్ ప్లే చేస్తున్నాను. ఇక లైఫ్ సినిమా కథగా చెప్పాలంటే, సాఫ్ట్ వేర్ నేపథ్యంలోసాగే కథ. చిన్న సినిమాలకు మంచి సపోర్ట్ ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను.
దర్శకుడు శ్రీను కోటపాటి మాట్లాడుతూ.. అంజన్న గారికి కథ చెప్పగానే బాగుంది. అయితే మోనాలిసా డేట్స్ తీసుకువస్తే కథకు న్యాయం జరుగుతుందని చెప్పారు. అలా ఆమెను సంప్రదించడం అంగీకరించడం జరిగాయి. ఇది యూత్ ఫుల్ సినిమా. ఇందులో నేటి తరానికి చక్కటి సందేశం కూడా ఇమిడి వుంది.
మోనాలిసా మాట్లాడుతూ.. హైదరాబాద్ కు రావడం చాలా ఆనందంగా వుంది. నాతో తెలుగు సినిమా చేయడం చెప్పలేని ఆనందంగా ఉంది. ఇప్పుడు తెలుగు రాదు కానీ తెలుగు త్వరలో నేర్చుకుంటా, హీరోయిన్ గా చేస్తున్న లైఫ్ సినిమా అందరికీ మంచి లైఫ్ ఇస్తుందని భావిస్తున్నాను. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.







