మోక్షజ్ఞ దానికి సిద్ధంగా లేడు. కానీ, బాలకృష్ణ మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నాడు
వారసత్వం అనేది అన్ని రంగాల్లోనూ ఉంటుంది. రాజకీయాల్లో, బిజినెస్‌లో, సినిమాల్లో.. ఇలా ఏ రంగంలోనైనా వారసత్వం కొనసాగుతూనే ఉంటుంది. అయితే దీని గురించి సినిమా రంగంలోనే ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎంతోమంది వారసులు వచ్చారు. అందులో కొంతమంది టాప్ రేంజ్‌కి చేరుకుంటే, మరికొంతమంది వెలుగులోకి రాలేకపోయారు. టాలీవుడ్ విషయానికి వస్తే ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున వంటి హీరోలు తమ వారసుల్ని రంగంలోకి దింపి తమ పేరు ప్రఖ్యాతుల్ని కొనసాగించేలా చేశారు. వీరిలో బాలకృష్ణ మాత్రం తన కుమారుడు మోక్షజ్ఞ విషయంలో కాస్త తాత్సారం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మోక్షజ్ఞ తెరంగేట్రం చేస్తాడని, దానికి సంబంధించిన అన్ని శిక్షణలు తీసుకుంటున్నాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ, మోక్షజ్ఞ మాత్రం ఈ విషయంలో అంత సీరియస్‌గా ఉన్నట్టు కనిపించడం లేదు.
ఎందుకంటే అప్పుడప్పుడు మీడియాలో కనిపించే మోక్షజ్ఞకు హీరోకి ఉండే లక్షణాలు ఏవీ లేనట్టుగా కనిపిస్తున్నాడు. ఫిజిక్ విషయంలోగానీ, లుక్ విషయంలోగానీ ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదనేది అతన్ని చూస్తే అర్థమవుతుంది. బాలకృష్ణ మాత్రం కొడుకుని హీరోని చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. ఫోన్లోనే కథలు వింటూ ఏ సినిమాతో మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలనే విషయంలో కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే కొడుకు కోసం ఓ ఫిట్‌నెట్ ట్రైనర్‌ని, నటనలో మెళకువలు నేర్పే గురువుని పురమాయించినట్టు తెలుస్తోంది. లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన బాలయ్య ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. బాలకృష్ణ వారసుడు తెరపై కనిపిస్తే చూడాలని అతని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2021లో మోక్షజ్ఞ తెరంగేట్రం జరిగే అవకాశం ఉందని సమాచారం.













