Delhi: దాదాసాహెబ్ ఫాల్కే 2023 అవార్డు గ్రహీత మోహన్ లాల్… సూపర్ స్టార్ పై అభినందనల జల్లు..!

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) ను భారత సినీ రంగంలో అత్యంత విశిష్ట దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా, 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. “మోహన్‌లాల్ అద్భుతమైన సినీ ప్రయాణం ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకం. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు అజరామరం. తన అసమాన ప్రతిభ, వైవిధ్యంతో భారత సినీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని నెలకొల్పారు” అని తమ పోస్ట్‌లో తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ… మోహన్‌లాల్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. “మోహన్‌లాల్ ప్రతిభకు, వైవిధ్యానికి నిలువుటద్దం. దశాబ్దాలుగా మలయాళ సినిమాకు ఆయన వెలుగు దివిటీలా నిలిచారు. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఆయన ప్రదర్శించిన నటన అద్భుతం” అని ప్రధాని కొనియాడారు. ఆయన విజయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఆకాంక్షించారు.
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రస్థానంలో మోహన్‌లాల్ 400కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. గతంలో ఆయనను భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
సెప్టెంబర్ 23న జరగనున్న 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో మోహన్‌లాల్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. కాగా, 2022 సంవత్సరానికి గాను ఈ అవార్డును ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి అందుకున్నారు.