ఎక్కడ నుంచి తీయాలో ఎక్కడ ఆపాలో నాకు తెలుసు
ఎన్టీఆర్ చిత్రాన్ని ఎక్కడి నుంచి తీయాలో ఎక్కడ ఆపాలో తనకు తెలుసని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సృష్టం చేశారు. విజయవాడలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ చిత్రం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. సంక్రాంతికి ఎన్టీఆర్ చిత్రం విడుదలకానున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించడం అదృష్టమన్నారు. ఎన్టీఆర్ చిత్రం ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించిందని అన్నారు. ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా ఏటా మహానాడు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. భావితరాలకు గుర్తుండేలా ఎన్టీఆర్ సినిమా రూపొందిస్తున్నామని తెలిపారు. ఏ కొడుకూ ఇంతవరకు తన తండ్రి పాత్ర చేయలేదని, అలా చేసే అదృష్టం తనకే దక్కిందని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారని తెలిపారు.
నమ్మక ద్రోహం చేసినవాళ్ళకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి కేంద్రం నాలుగేళ్లుగా ఎలాంటి న్యాయం చేయలేదని, అందుకే చంద్రబాబు ధర్మపోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేని కార్యకర్తలు టీడీపీకి ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.













