జనసేన కోసం మెగా హీరోల ప్రచారం?
జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ పిలవాలే కానీ రంగంలోకి దిగడానికి రెడీ అని ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలంతా పలు సందర్భాల్లో చెప్పారు. ఏపీలో ఎలక్షన్స్ దగ్గరకొస్తున్న టైమ్ లో పవన్ కోసం రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ రెడీగా ఉన్నారు. బాబాయ్ నుంచి పిలుపు రావడమే లేటు. ఆయన కోసం తాను ఏం చేయడానికైనా రెడీ అని రామ్ చరణ్ ఇప్పటికే చెప్పాడు.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన చిన్న మామ కోసం రెడీగా ఉన్నట్లు తెలిపాడు. తాను రెడీగా ఉన్నప్పటికీ పవన్ పిలవడం లేదని ఓ సందర్భంలో చెప్పి నవ్వాడు సాయి తేజ్. అన్న సాయి తేజ్ మార్గంలోనే వైష్ణవ్ కూడా నడుస్తాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ్ముడు ఏం చేసినా తన పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే చెప్పాడు.
దీన్ని బట్టి పవన్ అడిగితే చిరూ కూడా జనసేన తరపున క్యాంపైనింగ్ చేయడానికి రెడీగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఎలక్షన్ దగ్గర పడుతున్న కారణంగా నాగబాబు సైతం జనసేన పనుల్లో యాక్టివ్ అయిన విషయం తెలిసిందే. ఇకపై తాను యలమంచిలిలోనే ఉంటానంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. దీంతో ఆయనకు అక్కడ సీటు ఇస్తారా లేదా ఇంకెక్కడినుంచైనా నిలబెడతారా అన్నది తెలియాల్సి ఉంది.
నాగబాబుకు సీటు కన్ఫర్మ్ అయితే తండ్రి కోసం వరుణ్ తేజ్ రంగంలోకి దిగే అవకాశముంది. ఒకవేళ నాగబాబు పోటీ చేయకపోయినా బాబాయి పవన్ కోసమైనా వరుణ్ ప్రచారం చేస్తాడు. రీసెంట్ గా ఆపరేషన్ వాలెంటైన్ ప్రమోషన్స్ లో సైతం బాబాయ్ పిలిస్తే కచ్ఛితంగా ప్రచారం చేస్తానన్నాడు. మరి వీళ్లందరినీ పవన్ జనసేన కోసం ప్రచారానికి తీసుకొస్తాడా లేక టీడీపీతో కలిసి ప్రచారం చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ కోసం మెగా ఫ్యామిలీ అంతా కలిసి ప్రచారం చేసింది. మరిప్పుడు పవన్ కూడా అన్నయ్య దారిలో వెళ్తాడా లేదా అన్నది చూడాలి.













