మీనాక్షి ఇలాంటి పాత్ర అవసరమా?
ఈ సినిమాలో నటిస్తావా అని త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ అడిగితే, అది కూడా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో అంటే ఏ హీరోయిన్ అయినా వెంటనే ఒప్పేసుకుంటుంది. మీనాక్షి చౌదరి కూడా అదే చేసింది. శ్రీలీల ఇందులో మెయిన్ లీడ్ చేస్తుందని తెలిసినా, తను సెకండ్ హీరోయిన్ అని చెప్పినా సరే మీనాక్షి ఈ సినిమాను ఓకే చేసింది.
మహేష్ మరదలి క్యారెక్టర్ కదా నటనకు స్కోప్ ఉంటుంది, ఒక సాంగ్ ఎలాగూ ఉండే ఉంటుంది అన్నట్లు మీనాక్షి గుంటూరు కారం చేసినట్టుంది. కానీ సినిమాలో అమ్మడు రోల్ మాత్రం మహేష్ కు భోజనం ప్లేట్స్ తెచ్చివ్వడం, ఇంటికి రాగానే అమ్మకు కేకేసి చెప్పడం, మందు తాగుతుంటే ఆమ్లెట్ ప్లేట్ ఇవ్వడం ఇంతే. ఇంతకు మించి ఈ సినిమాలో మీనాక్షి పాత్ర గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు.
ఓ వైపు వరుణ్ తేజ్, విశ్వక్సేన్, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోల పక్కన హీరోయిన్ గా నటిస్తూ, ఇలాంటి సినిమా ఒప్పుకోవడమేంటని మీనాక్షిని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రీసెంట్ గా తమిళ స్టార్ విజయ్ తో కూడా ఓ సినిమాకు సైన్ చేసింది మీనాక్షి. అలాంటి క్రేజీ ప్రాజెక్టులు చేతిలో పెట్టుకుని ఎంత త్రివిక్రమ్ అడిగితే మాత్రం ఇలాంటి రోల్స్ చేయడం వల్ల ఉపయోగమేముందని మీనాక్షిని తన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాగా గుంటూరు కారం సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై మిక్డ్స్ టాక్ ను తెచ్చుకుంది.













