100 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిన ఓటీటీ సంస్థ.. తిరస్కరించిన నిర్మాతలు?
కరోనా వల్ల సినిమాలకు, సినిమాను నమ్ముకొని పనిచేసేవారికి ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో అందరికీ తెలిసిందే. షూటింగ్ సగంలో ఉన్న సినిమాలు పూర్తి చేసుకోలేక, పూర్తయిన సినిమాలు రిలీజ్ చేసుకోలేక నానా కష్టాలు పడుతున్నారు. రిలీజ్‌కి రెడీగా ఉన్న సినిమాలకు ఓటీటీ ఓ వరంలా కనిపించింది. కొంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు. తమ తమ సినిమాలు ఓటీటీలో రిలీజ్ చే్సుకుంటున్నారు. కొంతమంది నిర్మాతలు మాత్రం ఓటీటీలో రిలీజ్ చెయ్యడానికి ఒప్పుకోవడం లేదు. విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన `మాస్టర్` చిత్రం మరో 20 రోజుల్లో రిలీజ్ అవుతుందనగా లాక్డౌన్ వచ్చి పడింది. అప్పటి నుంచి పలు ఓటీటీ సంస్థలు మాస్టర్ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దానికోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, చిత్ర నిర్మాతలు తమ సినిమా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఒప్పుకోవడం లేదు.
ఇప్పటికే తమిళనాడులోని థియేటర్ యజమానులు హీరో సూర్యపై చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుదల చేశారు. ఇకముందు సూర్య సినిమాలు థియేటర్స్‌లో విడుదల కానివ్వమని హెచ్చరిస్తున్నారు. మరోపక్క ధనుష్ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తుండడంతో అభిమానులు ఓటీటీకి వెళ్లొద్దని, థియేటర్స్‌లోనే రిలీజ్ చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా ఓ బడా ఓటీటీ సంస్థ `మాస్టర్` సినిమాకు 100 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందట. ఇదే నిజమైతే సౌత్ ఇండియాలో డిజిటల్లో భారీ డీల్ ఇదే అవుతుంది. ఈ ఆఫర్‌ను కూడా మాస్టర్ చిత్ర నిర్మాతలు తిరస్కరించారట. వచ్చే ఏడాది సంక్రాంతికి అయినా తమ సినిమాను రిలీజ్ చేస్తాము తప్ప ఓటీటీకి ఇవ్వం అని ఖరాఖండీగా చేప్పేసారట.













