మార్షల్ ఆడియో, టీజర్ ఆవిష్కరణ
అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం మార్షల్. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొత బ్యానర్లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబరు 19న విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో, టీజర్ ఆవిష్కరణ గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు హాజరై ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత, హీరో అభయ్ అడకా మాట్లాడుతూ నేను పుట్టి పెరిగిన గుంటూరులో నా తొలి చిత్రం ఆడియో ఫంక్షన్‌ను ఇంతమంది పెద్దల సమక్షంలో చేయడం ఆనందంగా ఉంది. ఇదో వైవిధ్యభరితమైన చిత్రం. ఈ సినిమాతో ఓ మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నాం అని తెలిపారు.
దర్శకుడు జై రాజాసింగ్ మాట్లాడుతూ ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. నిర్మాత, హీరో అభయ్ అడకా పాత్ర ఎంతో హుందాగా, కొత్తగా ఉంటుంది. సీనియర్ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక మరచిపోలేని పాత్రకు ప్రాణం పోశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు జై రాజాసింగ్, హీరోయిన్ మేఘా చౌదరి, సంగీత దర్శకులు యాదగిరి, గణేష్ మాస్టర్, షేక్ మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరి, అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, ముస్తఫా, నటీనటులు కల్పవల్లి, జబర్దస్త్ అప్పారావు, ననీన్, వెంకటేశ్వర రావు, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.













