మహేష్ మామూలోడు కాదు
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న గుంటూరు కారం సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని చాలా ప్లాన్డ్ గా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు గుంటూరు కారం టీమ్. ఇదిలా ఉంటే గుంటూరు కారం కు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్న మనోజ్ పరమహంస తాజాగా ఓ ఇంటర్య్వూలో మహేష్ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.
మహేష్ కు 24 క్రాఫ్ట్స్ మీద పూర్తి అవగాహన ఉందని, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మీద మహేష్ కు చాలా పట్టుందని, లైటింగ్ నుంచి ఫ్రేమ్స్ వరకు ప్రతీదీ ఆయనకు తెలుసని చెప్పుకొచ్చారు. అంతేకాదు, చిన్న లైటింగ్ తేడా వచ్చినా మహేష్ కనిపెట్టేస్తాడని, మిగిలిన హీరోలు సినిమాటోగ్రఫీని అంతగా పట్టించుకోరని ఆయన తెలిపారు.
సెట్లో మహేష్, తనకు ఎన్నో విషయాలు చెప్తాడని, ఏ సీన్ కు ఎలాంటి షాట్ అయితే బాగుంటుందనేది కూడా మహేష్ కు బాగా తెలుసని, అతని ఆలోచనల కంటే బెటర్ అవుట్‌పుట్ ఇవ్వడానికి నేనెంతో కష్టపడుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న మహేష్ ఫ్యాన్స్ అందుకే మహేష్ స్క్రీన్‌పై అంత అందంగా కనిపిస్తాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు.













