మలేషియాలో టాలీవుడ్ కోసం భారీ ఈవెంట్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం పెద్ద భవనం కట్టించడంతో పాటూ అనేక కార్యక్రమాలు చేస్తానని హామీలిచ్చి రెండేళ్ల కిందట మా ఎన్నికల్లో గెలిచాడు మంచు విష్ణు. బిల్డింగ్ కట్టించకపోయినా వాటిలో కొన్ని హామీలైతే నెరవేర్చాడు. మా అధ్యక్షుడిగా విష్ణు ఇండస్ట్రీ తరఫున ఇప్పటివరకు పెద్ద ఈవెంట్ ఏదీ చేయలేదు.
కొన్ని కార్యక్రమాల కోసం ప్లానింగ్ జరిగినా అవి కార్యరూపం దాల్చలేదు. ఈ ఇయర్ జులైలో మలేషియాలో టాలీవుడ్ కోసం భారీ ఎత్తున ఓ ఈవెంట్ చేయబోతున్నట్లు మంచు విష్ణు వెల్లడించాడు. హైదరాబాద్లో జరిగిన మా ప్రెస్ మీట్ లో విష్ణు ఈ విషయాన్ని వెల్లడించాడు. నవతి పేరుతో ఈ ఈవెంట్ జరుగుతుందని, నభూతో అనేలా ఈ ఈవెంట్ నిర్వహిస్తామని విష్ణు వెల్లడించాడు.
రెండేళ్ల కిందట వనతి పేరుతో 90 ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్ చేయాలనుకున్నామని తెలిపిన విష్ణు, అనేక కారణాల వల్ల ఆ వేడుక వాయిదా పడుతూ వచ్చిందని ఇలాంటి ఈవెంట్స్ గతంలో కూడా జరిగాయని, మలేషియాలో నిర్వహించనున్న ఈ ఈవెంట్ ను భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు విష్ణు అనౌన్స్ చేశాడు. ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి డేట్ ప్రకటిస్తామని చెప్పిన విష్ణు, ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు స్వర్ణయుగం నడుస్తోందన్నాడు. తెలుగు సినిమా ఇన్ని ఘనతలు సాధించిన ఈ టైమ్ లో ఇలాంటి ఈవెంట్ చేయడం కరెక్టనిపించిందని ఈ విషయం గురించి ఛాంబర్ పెద్దలతో ఇప్పటికే మాట్లాడామని, తెలుగు సినిమా కీర్తిని పెంచేలా ఈ ఈవెంట్ ను చేయనున్నామని విష్ణు తెలిపాడు.













