Manchu Manoj: నారావారిపల్లిలో మంత్రి నారా లోకేష్‌ను కలిసిన మంచు మనోజ్
నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) తన భార్య మౌనికతో (Bhuma Mounika) కలిసి నారావారిపల్లిలో మంత్రి నారా లోకేష్‌ను (Nara Lokesh) కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మనోజ్ తనకు ఎదురవుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యలపై మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించి పలు చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, మంచు కుటుంబంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు పెద్ద కలకలానికి దారి తీశాయి. నారావారిపల్లె నుంచి మోహన్ బాబు కాలేజీ వరకు మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, రాత్రికి రాత్రే మనోజ్‌కు సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కాలేజీ వద్ద భద్రతను పెంచారు.
మంచు మనోజ్ కాలేజీకి రావొద్దంటూ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. న్యాయస్థానంలో కేసు నడుస్తున్న నేపథ్యంలో మనోజ్‌ను కాలేజీ ప్రాంగణంలోకి అనుమతించరాదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న మనోజ్ కాలేజీకి వెళ్లకుండా నారావారిపల్లెకు వెళ్లారు. అనంతరం, జల్లికట్టు జరగనున్న రంగంపేటకు వెళ్లనున్నట్లు సమాచారం.
మరోవైపు, మంచు మనోజ్ కాలేజీ ప్రాంగణానికి రావడాన్ని నిరోధించేందుకు మోహన్ బాబు కోర్టులో ఇంజెక్షన్ పిటిషన్ వేశారు. కోర్టు ఈ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుని అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల కాలేజీ గేట్ల వద్దకు వచ్చిన మనోజ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ మనోజ్ పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమయం అంతా తన సెక్యూరిటీ, కెమెరామెన్ల ద్వారా వీడియో తీయించారు.
మనోజ్‌తో పాటు ఆయన భార్య మౌనిక కూడా కాలేజీ వద్దకు వెళ్లారు. అయితే, కాలేజీకి అనుమతి లేనందున వారు తిరిగి నారావారిపల్లెకు వెళ్లారు. అక్కడ మంత్రి నారా లోకేష్‌ను కలిసిన మనోజ్, తన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు మంచు కుటుంబంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తతకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ వ్యవహారానికి సంబంధించి మరింత స్పష్టత రానుంది.













