ఆ సినిమాకు సీక్వెల్ చేయబోతున్న యాత్ర డైరెక్టర్
టాలీవుడ్ లో మంచి అభిరుచి ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మహి వి. రాఘవ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు మాత్రం దక్కించుకున్నాడు. పాఠశాల పేరుతో చేసిన మొదటి సినిమాతోనే ఆయన డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత తాప్సీ ప్రధాన పాత్రలో వచ్చిన ఆనందో బ్రహ్మ అనే హర్రర్ కామెడీ అతనికి మంచి కమర్షియల్ సక్సెస్ అందించింది.
ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా యాత్ర అనే పొలిటికల్ బయోపిక్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి సీక్వెల్ గా రీసెంట్ గా యాత్ర2 కూడా తీశాడు. పొలిటికల్ అంశాలను పక్కనపెడితే ఈ రెండు కథలను మహి డీల్ చేసిన విధానం మాత్రం బాగుంది. మంచి అభిరుచి ఉన్న మహి నుంచి పొలిటికల్ కంటే మామూలు సినిమాలు చూడాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు.
చాలా కాలం తర్వాత ఇప్పుడు మహి ఆడియన్స్ కోరుకున్న విధంగానే చేయబోతున్నాడు. తన కెరీర్లో మంచి హిట్ గా నిలిచిన ఆనందో బ్రహ్మ కు మహి సీక్వెల్ తీయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. తాప్సీనే ఈ సీక్వెల్ లో కూడా లీడ్ రోల్ లో నటించనుందట. తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తనకు ఆనందోబ్రహ్మ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ ఇచ్చిన డైరెక్టర్ తో ఆ సినిమాకు సీక్వెల్ చేసే ఛాన్స్ రావడంతో ఆమె కూడా ఈ సినిమా చేయడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు సమాచారం.













