అమ్మకు ప్రేమతో మహేష్ బాబు.. నువ్వు ప్రసాదించిన ప్రతిరోజు చాలా గొప్పది! భావోద్వేగ ట్వీట్ పెట్టిన మహేష్
అమ్మను మించిన దైవం ఉన్నదా? అంటూ ట్విట్టర్ ఖాతాలో అమ్మ ఇందిరమ్మకు ప్రత్యేకంగా హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు మహేష్ బాబు. ఈ మేరకు ఆయన పోస్ట్ చేసిన సందేశం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ లోకంలో అమ్మ ప్రేమ ముందు ఏదైనా తక్కువే. నవమాసాలు మోసి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసిన అమ్మనే మొదటి గురువు. అమ్మ ప్రేమలో తీయదనాన్ని గురించి మాటల్లో వర్ణించలేం. పేద- ధనిక, సాధారణ- సెలబ్రిటీ అనే తేడా లేకుండా అందరికీ అమ్మ అమ్మే.. అమ్మ ప్రేమ ఒక్కటే. కాగా ఈ రోజు (ఏప్రిల్ 20) సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిర పుట్టినరోజు. ఈ సందర్భంగా తన తల్లికి స్వీట్ విషెష్ చెబుతూ ఆమెతో దిగిన ఓ పిక్ షేర్ చేశారు మహేష్. తన సోషల్ మీడియా ఖాతాల్లో అమ్మ ఇందిరకు స్పెషల్గా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మహేష్ బాబు.. ”నువ్వు ప్రసాదించిన ప్రతిరోజు చాలా గొప్పది” అంటూ అమ్మ మనసుకు హత్తుకునేలా సింగల్ లైన్ కామెంట్ చేశారు. ఇది చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇందిరకు పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ చెబుతూనే ‘ఓ అమ్మకు కొడుకు ఇంతకంటే గొప్ప బహుమతి ఏమివ్వగలడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.













