60 రోజులు బ్రేక్ లేకుండా మహేష్ సినిమా షూటింగ్…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు తన 28వ సినిమా చేయడానికి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై అన్నివర్గాల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. త్రివిక్రమ్ కూడా ఫాన్స్ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి తెరపైకి తీసుకురాబోతున్నాడు.
ఇక SSMB28 సినిమా వివరాల్లోకి వెళ్తే, మొదట అనుకున్న కథ అంత నమ్మకంగా లేకపోవడంతో దాన్ని క్యాన్సల్ చేసి మరొక కొత్త కథను సెట్స్ పైకి తీసుకురావడం జరిగింది. అయితే త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేయాలని పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నాడు. డిసెంబర్ చివరి వారంలోనే ఈ సినిమాకి సంబంధించిన భారీ షెడ్యూల్ ను మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ, మహేష్ ప్రతి క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళుతూ ఉంటాడు.
తన ఫ్యామిలీతో ప్రత్యేకంగా టైం స్పెండ్ చేయడానికి మహేష్ బాబు ముందుగానే న్యూ ఇయర్ కి ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. అదే విధంగా ఈసారి కూడా అమెరికా వెళ్లడంతో మళ్ళీ ఈ షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఇక మహేష్ బాబు తిరిగి వచ్చిన తర్వాతే సినీమా మిగిలిన షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ షూటింగ్ కి సంబంధించి జనవరి రెండవ వారం నుంచి త్రివిక్రమ్ ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు 60 రోజుల పాటు ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ కంటిన్యూ చేయబోతున్నారట.
మహేష్ బాబు బ్రేక్ తీసుకున్నప్పటికీ కూడా త్రివిక్రమ్ మాత్రం గ్యాప్ లేకుండా వర్క్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సెలవులు ఆదివారాలు అని చూడకుండా ఈ లాంగ్ షెడ్యూల్ పక్కా ప్రణాళికతో రెడీ చేసినట్లు సమాచారం. ఎందుకంటే సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసే త్రివిక్రమ్ మళ్ళీ మరో ప్రాజెక్టును కూడా తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. మహేష్ బాబు కూడా రాజమౌళితో కొత్త సినిమాను స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయితే అంత మంచిది అని కోరుకుంటున్నాడు.













