MAA: కిమ్స్ సన్ షైన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించిన విష్ణు మంచు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి విష్ణు మంచు ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తరువాత ఆరోగ్యానికి పెద్ద పీఠ వేసిన సంగతి తెలిసిందే. ‘మా’ సభ్యుల ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్‌లను విష్ణు మంచు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సిటీలోని పెద్ద మల్టీస్పెషాల్టీ హాస్పిటల్స్‌తో కలిసి హెల్త్ క్యాంప్‌లను నిర్వహించారు. ఇక ఈ హెల్త్ క్యాంప్‌లో ‘మా’ సభ్యులంతా పాల్గొని విజయవంతం చేస్తున్నారు.
ఇక ఈక్రమంలో ఆదివారం నాడు కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యుల కోసం విష్ణు మంచు హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు మంచు, ‘మా’ ట్రెజరర్ శివ బాలాజీ, రాజీవ్ కనకాల వంటి వారు పాల్గొన్నారు. ఇక హాస్పిటల్ తరుపున కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ సీఓఓ సుధాకర్ జాదవ్, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డా. నవ వికాస్ జుకంటి, కన్సల్టంట్ వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్, డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ డా. నిషాన్ రెడ్డి, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్, డా. ముదుమల ఐసాక్ అభిలాష్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో విష్ణు మంచు మాట్లాడుతూ .. ‘‘మా’ సభ్యుల ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్‌లను విజయవంతం చేసిన సభ్యులకు, హాస్పిటల్ బృందానికి ధన్యవాదాలు. సభ్యుల ఆరోగ్యమే మాకు ప్రాధాన్యం. అందుకే ఇలా నిత్యం హెల్త్ క్యాంప్‌లను నిర్వహిస్తున్నాం. మాకు సహకరించిన కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ బృందానికి ధన్యవాదాలు’ అని అన్నారు.
శివ బాలాజీ మాట్లాడుతూ .. ‘‘మా’ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం కోసం మేం ఎల్లప్పుడూ ముందుంటాం. అందుకే ఇలా నిత్యం హెల్త్ క్యాంప్ల్ని నిర్వహిస్తూ ఉన్నాం. వీటికి సహకరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. ఆర్టిస్టులు ఎక్కువగా సమయం అనేది పట్టించుకోకుండా పని చేస్తుంటారు. “మా” సభ్యుల కోసం ఇలా నిత్యం హెల్త్ క్యాంప్ లు నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ సీఓఓ సుధాకర్ జాదవ్ మాట్లాడుతూ .. ‘‘మా’ సభ్యుల కోసం ఇలా హెల్త్ చెకప్ నిర్వహించడం గొప్ప విషయం. ఈ కార్యక్రమం కోసం ముందుకు వచ్చిన విష్ణు మంచు గారికి అభినందనలు. మేం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఎల్లప్పుడూ వారికి సహకరిస్తూనే ఉంటామ’ని అన్నారు.







