అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అక్టోబర్ 10న ఎన్నికల్ని నిర్వహించబోతున్నట్లు మా క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. సాధ్యమైనంత తొందరలో మా ఎన్నికలు నిర్వహించాలంటూ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. కొవిడ్ ప్రొటోకాల్స్, సభ్యులు ఆసక్తులను దృష్టిలో పెట్టుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా అక్టోబర్ 10 ఆదివారం రోజున ఎన్నికల్ని నిర్వహించబోతున్నట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజు తెలిపారు. 2021-23 కాలానికి గానూ జరగనున్న కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పలువురు నటులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు తాము పోటీ చేస్తున్న విషయాన్ని వెల్లడించారు.













