రివ్యూ : సెన్సిబుల్.. ఎమోషనల్… బ్యూటిఫుల్….‘లవ్‌స్టోరి’.

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినిమాస్
నటీనటులు : నాగ చైతన్య , సాయి పల్లవి, ఈశ్వరీరావు, రావు రమేశ్, పొసాని కృష్ణ మురళి తదితరులు
సంగీతం : పవన్ సీహెచ్, సినిమాటోగ్రఫీ : విజయ్.సి.కుమార్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్; నిర్మాతలు : కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
విడుదల తేది : 24.09.2021
మొదటినుండి సెన్సిబుల్ కథలతో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడం లో దర్శకుడు శేఖర్ కమ్ముల దిట్ట. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని ప్రేమకథలను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తుంటారు దర్శకుడు. ప్రేమలో ఇద్దరు వ్యక్తులు కలవడానికి వచ్చే అవాంతరాలెన్నోఉంటాయి, వాటిని వెండితెరపై చూపించే చిత్రాలకు ఆదరణ బాగానే ఉంటుంది. పక్కా క్యూట్ అండ్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ స్టోరీస్ అందులో ప్రేమ కథలను మిక్స్ చేసి సినిమాలను రూపొందించడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఓ స్టైల్ ఉంది. అయితే ఈసారి శేఖర్ కమ్ముల తన పంథాను మార్చుకుని ఓ డిఫరెంట్ ప్రేమకథను రూపొందించాడు. ఆ సినిమాయే ‘లవ్‌స్టోరి’. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. ప్రేమకు అడ్డుపడే కులాలు, డబ్బు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మరీ ‘లవ్‌స్టోరి’ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ లో చూద్దాం.
కథ:
నిజామాబాద్‌లోని ఆర్మూర్ గ్రామంలో అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్(నాగ చైతన్య) ఏదైనా బిజినెస్ చేయాలని నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జుంబా డ్యాన్స్ సెంటర్ నడుపుతుంటాడు. రేవంత్ గ్రామానికే చెందిన మౌనిక(సాయి పల్లవి) బిటెక్ పూర్తిచేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యోగం లభించకపోవడంతో రేవంత్ జుంబా సెంటర్‌లో పార్ట్‌నర్‌గా జాయిన్ అవుతుంది. ఇలా భిన్నమైన సామాజిక వర్గాలు కలిగిన రేవంత్, మౌనికల మధ్య స్నేహం ఏర్పడుతుంది. అది కాస్త నిదానంగా ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ విషయాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని అయితే వారి ప్రేమకు ఆస్థులు, అంతస్థులతో పాటు కులం అడ్డుగోడగా నిలుస్తుంది. కులం కోసం ఎంతటి దారుణానికైనా పెద్దలు దిగజారుతారని తెలుసుకున్న రేవంత్, మౌనిక పారిపోవడానికి ఓ పథకం వేసుకుంటారు. ఇంతకీ ప్లాన్ ప్రకారం ఇద్దరూ పారిపోయారా? ఇద్దరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల హావభావాలు:
రేవంత్ పాత్రలో నాగచైతన్య ఒదిగిపోయాడు. ముఖ్యంగా డ్యాన్స్ విషయంగా చైతూ చాలా మెరుగయ్యాడు. గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీలో కష్టమైన స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇక మౌనిక పాత్రలో సాయి పల్లవి ఎప్పటి మాదిరే పరకాయ ప్రవేశం చేసింది. ఇక సాయి పల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కష్టమైన స్టెప్పులను ఈజీగా వేసి అదరగొట్టేసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తెరపై రేవంత్, మౌనిక పాత్రలు మాత్రమే కనిపిస్తాయి తప్ప సాయి పల్లవి, చైతూలు అస్సలు కనిపించరు. ఇక హీరో తల్లిపాత్రలో ఈశ్వరీరావు తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. మౌనిక బాబాయి నరసింహం పాత్రలో రాజీవ్ కనకాల మెప్పించాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ తనది. హీరోయిన్ తల్లిగా దేవయాని, ఎస్సైగా ఉత్తేజ్ తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
శేఖర్ కమ్ముల ఇది వరకు ప్రస్తావించినట్లు డిఫరెంట్ రూట్‌ను ఎంచుకున్నాడు. తనిప్పటి వరకు చేయని ప్రేమకథతో ‘లవ్‌స్టోరి’ని తెరకెక్కించాడనే చెప్పాలి. దర్శకుడు రాసిన కథ మరియు పాత్రలు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాల్లోని సంఘటనలు పరిస్థితుల ఆధారంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కథను దర్శకుడు చాలా సున్నితంగా నడుపుతూ.. సినిమాలో ప్రేమతో పాటు ఆ ప్రేమలోని ఎమోషన్ని, పెయిన్ని కూడా హైలెట్ అయ్యే విధంగా కొన్ని ఏమోషనల్ సన్నివేశాలను బాగా మలిచాడు. ఇక ఈ సినిమాకు పవన్ అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచింది. సినిమా విడుదలకుముందే సారంగ దరియా పాట ఎంత పెద్ద సెన్సేషనో కొత్తగా చెప్పనక్కర్లేదు. నీ చిత్రం చూసి… ఏవో ఏవో కలలే… పాటలు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. ఇక విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ బావుంది.< /p>
విశ్లేషణ:
నేటి జెనరేషన్ లో ప్రేమకథలను తెరకెక్కించాలనుకోవడం దర్శకులకు కత్తిమీద సాము వంటిది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో వచ్చే సినిమాలను మనం ఇంట్లో వుండే చూసే పరిస్థితి వచ్చింది. ఎన్నో వైవిధ్యమైన ప్రేమకథలను వీక్షిస్తున్న మన ప్రేక్షకులను మెప్పించాలంటే అంత సులభమైన విషయం కాదు. ఇద్దరు ప్రేమికులు అనుకోకుండా కలుసుకోవడం, ప్రేమించుకోవడం.. పెద్దలు వారి ప్రేమను ఒప్పుకోకపోవడంతో పారిపోవాలనుకోవడం, ఎదిరించడం కథ సుఖాంతం కావడమో, లేక దుఃఖాంతం కావడమో అనే కథాంశం తో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాంటిది కొత్తగా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాలి. అలా కొత్తగా ఫీల్ అవ్వకపోతే ప్రేక్షకుడు పెదవి విరచడం ఖాయం. ప్రేమకు కావాల్సింది కులాలు, ఆస్థులు, అంతస్తులు కావు.. రెండు మంచి మనసులు అనే విషయాన్ని చక్కగా ఎలివేట్ చేశాడు. ఒకవైపు తనది బడుగు కులం అని ఇతరులు హేళన చేస్తున్నా, పట్టించుకోకుండా ఎదగి చూపించాలనే కసి ఉన్న యువకుడిగా నాగచైతన్య పాత్రను మలిచాడు డైరెక్టర్ శేఖర్. సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగుతూ రెగ్యులర్ సీన్స్ తో బోర్ కొడతాయి. అలాగే క్లైమాక్స్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. ఇక హీరో హీరోయిన్ల మధ్య కొన్ని లవ్ సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. మొత్తంగా రెగ్యులర్ ప్లే, స్లో నరేషన్ వంటి అంశాలు సినిమాకి కాస్త మైనస్ అయ్యాయి. మరి నాటకీయకంగా సాగుతున్న భావన కలుగుతుంది. మెయిన్ గా సెకెండ్ హాఫ్ లో సాయి పల్లవితో సాగే సన్నివేశాలు అలాగే క్లైమాక్స్ లో చైతు నటన బాగుంది. చివరగా చెప్పాలంటే ఇది ఓ .. సెన్సిబుల్, ఎమోషనల్.. బ్యూటిఫుల్…. ‘లవ్‌స్టోరి’.