ఖైదీ2 ఎలా ఉంటుందో చెప్పిన లోకేష్
లోకేష్ కనగరాజ్‌కు తమిళంతో పాటూ తెలుగులో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. దానికి కారణం ఆయన కార్తితో చేసిన ఖైదీ సినిమానే. ఆ సినిమా తమిళంతో పాటూ తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఖైదీ సినిమా కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఖైదీ సినిమాను లోకేష్, విక్రమ్ మూవీతో కనెక్ట్ చేయడంతో ఆ సినిమా స్థాయి, క్రేజ్ మరింత పెరిగాయి.
అయితే ఖైదీకి సీక్వెల్ తీస్తానని లోకేష్ ఎప్పట్నుండో అంటున్న విషయం తెలిసిందే. తాజాగా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో ఖైదీ సీక్వెల్ గురించి మాట్లాడాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా చేస్తున్న లోకేష్ కనగరాజ్, ఆ సినిమా అయిపోగానే ఖైదీ2ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలిపాడు. ఢిల్లీ గతంతో పాటూ, వర్తమానాన్ని ముడిపెడుతూ ఖైదీ2 కథ ఉండబోతుందని లోకేష్ వివరించాడు.
అంతేకాదు, ఖైదీ2 కచ్చితంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమేనని, విక్రమ్ లో విలన్ గా కనిపించిన సంతానం చనిపోతాడు కాబట్టి డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ మరొకరి చేతుల్లోకి వెళ్తుందని, ఆ విలన్ ఎవరనేది సినిమాలో చూపించనున్నట్లు చెప్పాడు. ఖైదీ2లో కొత్త ట్విస్ట్ లు, ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నట్లు, ఈ సినిమా చేయడం కోసం తాను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు లోకేష్ వివరించాడు.













