లోకేష్‌ను అలా అనొచ్చా?
ఓ డైరెక్టర్ తీసిన సినిమాలోని సీన్లను మరో డైరెక్టర్ తన సినిమాలో వాడుకుంటే దాన్ని కాపీ కొట్టాడంటాం. తనలో క్రియేటివిటీ లేదు కాబట్టే వేరే డైరెక్టర్ల సీన్లు తెచ్చుకుని పెట్టుకున్నారని కామెంట్స్ చేస్తాం. వాస్తవానికి ఇది అందరూ చేసేదే. కొత్తేం కాదు. కాకపోతే దాన్ని కాపీ అనకుండా ఇన్స్పైర్ అయ్యాం అని చెప్తుంటారు డైరెక్టర్లు.
ఇలా వేరే సినిమాలోని సన్నివేశాలను తమ సినిమాలో లిఫ్ట్ చేసి పెట్టే లిస్ట్ లో రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను చేర్చాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు ఆడియన్స్. కానీ ఆయన వేరే డైరెక్టర్ సినిమా కాకుండా తన సినిమాలోని సీన్ నే కాపీ కొట్టాడంటున్నారు.
విజయ్ తో లియో చేస్తున్న లోకేష్, ఈ ట్రైలర్ లో ఓ షాట్‌ను చూపించాడు. అందులో విజయ్ కుర్చీలో కూర్చుని పాపను గుండెల మీద వేసుకుని జో కొడుతూ ఉంటాడు. ఇదే సీన్ విక్రమ్ మూవీలో కమల్ హాసన్ తో కూడా చేయించాడు లోకేష్. ఈ రెండు సీన్స్ ఒకేలా ఉండటంతో ఆ రెండింటినీ మిక్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజన్లు. తన సినిమాలోని సీన్ తను పెట్టుకుంటే తప్పేంటని కొందరంటుంటే, ఏదైనా సరే కాపీనే కదా అని ఇంకొందరు, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న సినిమా కాబట్టి ఏదో లింక్ ఉంటుందని మరి కొందరు అంటున్నారు. లియో సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.













